Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board About Parliament Special Session Womens Reservation And Delimitation Debate May Create History

Story Board: పార్లమెంట్ సమావేశాలు చరిత్ర సృష్టించబోతున్నాయా..?

Published Date :April 16, 2026 , 9:23 am
By Sudhakar Ravula
Story Board: పార్లమెంట్ సమావేశాలు చరిత్ర సృష్టించబోతున్నాయా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు రిజర్వు చేయాలన్నే ప్రతిపాదన దేశంలో దశాబ్దాలుగా నలుగుతోంది. చట్టం చేయాలన్న ఆలోచనలోనే పలు అవరోధాలు ఎదురై ఎట్టకేలకు 2023లో మార్గం సుగమమైంది. అది కూడా 2024 సార్వత్రిక ఎన్ని కల వాకిట్లో ఆదరాబాదరాగా వచ్చిందే. అమలు ఎప్పట్నుంచి అన్న ప్రశ్న అప్పట్లోనే వివాదాస్పదమైంది. 2026 తర్వాత అందుబాటులో ఉండే తాజా జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్‌ అమలు పరచాలని నిర్ణయించి, దాన్నే చట్టంలో పొందుపరిచారు. కోవిడ్‌ కారణంగా 2021లో జరగని జనగణన 2025లో చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తారనీ, వెంటనే పునర్విభజన జరిపి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు జరపొచ్చనీ భావించారు. కానీ, 2025లో జన గణన మొదలు కాలేదు. ఇప్పుడు చేపట్టినా వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిచేయడం, ఆపై పునర్విభజన కమిషన్‌ ఏర్పరచి తాజా గణాంకాలతో ఆ ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు కష్టమనే కొత్త అభిప్రాయం బలపడింది. దాంతో, ఇక రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల్లోనే అనుకున్నారు. మొదట్లో కేంద్రం కూడా ఇవే సంకేతాలిచ్చింద. మళ్లీ ఉన్నట్టుండి లేదు లేదు, తాజా జనగణనతో నిమిత్తం లేకుండా పాత లెక్కలతోనే పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ అమలు చేసేద్దాం అని ఎన్డీయే పెద్దన్న బీజేపీ తీసిన కొత్త రాగమే భిన్నాభిప్రాయాలకు కారణమైంది.

చట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఇప్పించడంలో మాకున్నంత పట్టుదల మరెవరికీ లేదని బీజేపీ నాయకత్వం చాటు కోవాలనుకుంటోంది. అందుకే తెలివిగా రిజర్వేషన్‌ అంశాన్ని పునర్విభజనతో ముడిపెట్టింది. 2023 మహిళా రిజర్వేషన్‌ చట్టంలో ఉన్నట్టుగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్‌ అంటే అది తప్పనిసరిగా జాప్యమౌతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. కానీ, 2029 లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా అంతకుముందే జరిగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, కర్టాటక, తెలంగాణ వంటి పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓట్ల మొగ్గుతో లబ్ధి పొందవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ అంశంపై జరిగే చర్చ ద్వారా ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగాల్సివున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల మహిళా ఓటర్లనూ బీజేపీ మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందనే అనుమానం కూడా వాటికి లేకపోలేదు. ఇక మహిళా రిజర్వేషన్ అమలులో బీసీ కోటా కోసం కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకూ న్యాయమైన వాటా దక్కాలని అడుగుతున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల సంఖ్యను పెంచితే ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దానికి విరుగుడుగా, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యకు ఏకరీతిలో అంతటా 50 శాతం పెంచడం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రచారం చేసేట్టు వ్యూహ రచన చేశారు. కానీ ఆ సంగతి ఎక్కడా అధికారికంగా చెప్పడం లేదు. చివరకు ఎంపీలకు సర్క్యులేట్ చేసిన డ్రాఫ్ట్ బిల్లులోనూ ఆ ప్రస్తావన లేదు. దీంతో 50 శాతం సీట్లు పెంచితే పెద్దగా తేడా రాకున్నా.. జనాభా ప్రాతిపదిక అయితే మాత్రం దక్షిణాదికి అన్యాయం తప్పదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అలా కాకుండా జీఎస్డీపీ, అభివృద్ధి ప్రమాణాల ప్రాతిపదికన సగం సీట్లు పెంచాలనే ప్రపోజల్ వచ్చినా.. అది ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో ఎంపీల సంఖ్యకు ప్రాతిపదిక ఏమిటి..? ఎమ్మెల్యేల సంఖ్య పెంపుకు వచ్చేసరికి భిన్న ప్రాతపదిక అమలౌతుందా..? రెండింటికీ ఒకే మూలసూత్రం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరింత చర్చ జరగాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. పెంపు వెంటనే చేపడితే మూడో వంతు సీట్లు కొత్తగా వస్తాయి కనుక మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు పరచడంలో ఎవరికీ ఇబ్బందులుండవని పాలక పక్షం వివరిస్తోంది. అలా జరిగితే, బీజేపీకి రాజకీయంగా పట్టున్న అధిక జనాభా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఆధిక్యత లభిస్తుంది. తక్కువ మోతాదులో సీట్లు పెరిగే దక్షిణా రాష్ట్రాల్లో తమకు ఎలాగూ పట్టు లేదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడాల్సిన రాజకీయ అవసరం ఉండదనేది కాషాయ పార్టీ భరోసా అని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. అంటే దక్షిణాదితో సంబంధం లేకుండా.. కేవలం ఉత్తరాదిని గుప్పిటపట్టి.. కేంద్రంలో అధికారం దక్కించుకునే ధోరణి ప్రమాదకరమనే వాదన వినపిస్తోంది. అందుకే ఈ వైఖరిని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరుగుదలకు కారణమైన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచి బహుమతినిస్తారా అని అవి ప్రశ్నిస్తున్నాయి.

అందుకే మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో విడదీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యలోనే మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్‌ అమలు పరచాలని ఆ పార్టీ అంటోంది. ఇందుకు పదిహేనేళ్లనాటి 2011 జనాభా లెక్కలు కాకుండా, వెంటనే జనగణన ముమ్మరం చేసి, 2027 మే నాటికి లభించే తాజా గణాంకాల్ని రిజర్వేషన్ల ఖరారుకు వాడుకోవాలని సూచిస్తోంది. ఇండియా కూటమి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది. కీలకమైన అంశాల్లో రాజకీయ లబ్ధి కాకుండా.. అందరికీ ఆమోదయోగ్యతను గీటురాయిగా తీసుకోవాలనేది విపక్షం సూచనగా ఉంది. నియోజకవర్గాల పెంపు విషయంలో ఏ పద్ధతి అనుసరించాల న్నది ప్రశ్నార్థకంగా మారింది. అందరు ఓటర్లు విలువ సమానంగా, ఒకటిగానే ఉండాలని మొదట్లో భావించారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను, భౌగో ళిక స్వరూపాలను మార్చాలని నిర్ణయించారు. ఇందుకుగానూ ప్రతి పదేళ్లకోసారి పునర్విభజన కమిషన్ల ఏర్పాటు ప్రతిపాదించారు. 1951, 1962, 1972లో అలా కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య 494 నుండి 522కు, 543కు పెరుగుతూ వచ్చింది.

కానీ జనాభా ప్రాతిపదికగా నియోజక వర్గాల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుందనే ఆలోచన 1972 తర్వాత వచ్చింది. అందుకే నాటి లోక్‌సభ స్థానాల సంఖ్య 543కు కట్టడి విధించి, 2000 సంవత్సరం వరకు సంఖ్యను మార్చొ ద్దని నిర్ణయించారు. ఈ మేరకు 42వ రాజ్యాంగ సవరణ తో ఒకసారి, 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మరోసారి సంఖ్యను పెంచకుండా 2026 వరకు కట్టడి చేయాల్సి వచ్చింది. 1913 నుండి ప్రతినిధుల సభ సభ్యుల సంఖ్యను అమెరికాలో 435కి కట్టడి చేసినట్టు మన దగ్గర కూడా కట్టడి చేయడమో, మరో హేతుబద్ధమైన ప్రత్యామ్నాయ విధానాన్నో వెతకాలి. జనాభా ప్రాతిపదికన ఏకరీతి సర్దుబాటు లోక్‌సభ స్థానాల్లో జరిపి, జనాభా నియంత్రించిన వారికి ప్రోత్సాహాలిచ్చే పద్ధతి రాజ్యసభ స్థానాల్లో కల్పించవచ్చనే సూచన వస్తోంది.

ఈ ప్రశ్నల సంగతి పక్కనపెడితే.. అసలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మీదే విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు పేర్కొంటున్నాయి. రెండు కీల‌క రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌కు ముందు ఇలా చేయ‌డం ద్వారా మ‌హిళా ప‌క్షపాతిగా మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఓట‌ర్ల‌ను ప్రభావితం చేయొచ్చని ఆరోపిస్తున్నాయి. ఈ ప్రత్యేక భేటీలో ఉభ‌య స‌భ‌ల్లో ఇత‌ర ఏ విష‌యాలు చేపట్టబోమ‌ని ఇరు స‌భ‌లు ప్రక‌టించాయి. వాస్తవానికి ఇది ప్రత్యేక భేటీ అయిన‌ప్పటికీ.. బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగానే జ‌రుగుతున్నాయి. కాబ‌ట్టి ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చ‌ర్చలు చేప‌ట్టాల‌ని ప్రతిప‌క్షాలు కోరుతున్నాయి. కానీ.. దీనికి ఉభ‌య స‌భ‌లు స‌సేమిరా అంటున్నాయి. దీంతో ఇది మ‌రిన్ని అనుమానాల‌కు తావిచ్చింది. ఏతావాతా తాననుకున్నది చేయటానికి కేంద్రం ఉద్దేశపూర్వకంగా అయోమయం సృష్టించి.. చివరివరకూ ఉత్కంఠ కొనసాగించి.. ఆ గందరగోళం మధ్యే బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలనే వ్యూహరచన చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి.

మహిళా రిజర్వేషన్ చట్టం మొదటి ప్రతిపాదన ప్రకారం తదుపరి జనగణన పూర్తై, డిలిమిటేషన్ జరిగాకే రిజర్వేషన్ అమల్లోకి రావాలి. కానీ ఇప్పటికే 2021 జనగణన వాయిదా పడుతూ వచ్చింది. ఈ అసాధారణ పరిస్థితి వల్ల అమలు 2030ల వరకూ వాయిదా పడుతుందని అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, 2029 ఎన్నికలు సమీ పిస్తుండగా, ప్రభుత్వం హఠాత్తుగా సవరణల దిశగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచి, అందులో 33 శాతానికి పైగా స్థానాలను మహిళలకు కేటాయించాలనే ప్రతిపాదన చేస్తోంది. అలాగే జనగణనతో ఉన్న అనుసంధానాన్ని తొలగించి, ఇప్పటికే ఉన్న గణాంకాల ఆధారంగా అమలు చేయాలని నిర్ణయిస్తోంది. ఈ ఆకస్మిక మార్పు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2014 నుంచే స్పష్టమైన మెజారిటీ ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం, 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు విషయంలో 2023 వరకూ ఎందుకు వేచి చూసిందనేది కాంగ్రెస్ అడిగిన మొదటి ప్రశ్న. అంతకుముందు యూపీఏ ప్రభుత్వాలు ప్రయత్నించినా, రాజకీయ ఏకా భిప్రాయం లేక విఫలమయ్యాయి. కానీ ఎన్‌డీఏ ముందుగానే దీన్ని ఆమోదింపజేసుకుంది. కానీ, అమలు ఆలస్యం అయ్యేలా షరతులు చేర్చడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. 2024 ఎన్నికలపై ప్రభావం లేకుండా ఉండేందుకు ఇదే మార్గమని విమర్శకులు అప్పుడు సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు, బీజేపీ సొంతంగా మెజారిటీ కోల్పోయిన తరుణంలో, సవరణలు రాజకీయ అవసరంగా ముందుకు వస్తున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

ప్రధాని మోడీ 2026 ఏప్రిల్ 11న అన్ని పార్టీల నేతలకు రాసిన లేఖలో.. మహిళా సాధికారతకు ఏకగ్రీవ మద్దతు కోరారు. అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మధ్యలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం అధికార కూటమి ఉద్దేశ్యాలపై సందేహాలకు తావిస్తోంది. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంచాలనుకుంటున్న ఎన్‌డీఏ, పార్లమెంట్ విస్తరణతో ప్రాంతాల మధ్య సమతుల్యత కాపాడుతామని చెబుతోంది. కానీ ఇదే వాదన 2023లో ఎందుకు వినిపించలేదు? అప్పుడే జనగణనను పూర్తి చేసి ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు.. ప్రస్తుతం 2011 గణాంకాలను ఆధారంగా తీసుకోవడం వల్ల రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేదేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజ్యసభ, శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్ వర్తించదు. రాజకీయ పార్టీల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే దిశగా ఎన్‌డీఏ చర్యలు పరిమితంగానే ఉన్నాయి. బీజేపీ కూడా సాధారణ స్థానాల్లో 33 శాతం మహిళా అభ్యర్థులను నిలబెట్టడంలో ఇప్పటికే వెనుకబడిందని ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి.

మహిళల ఉపాధి శాతం తక్కువగా ఉండటం, రాజ కీయాల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉండటం వల్ల విధానాల్లో లోపాలు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో మహిళా నాయకత్వం మంచి ఫలితాలు ఇచ్చినట్టు పరిశోధనలు చెబుతున్నాయి. కానీ జాతీయ స్థాయిలో అదే ఫలితాలు రావాలంటే, సీట్ల కేటాయింపు త్వరగా చేపట్టాలి. అదే సమయంలో ఈ చట్టం సామర్థ్యాన్ని నిరాకరించలేం. 2029లో అమలు అయితే, దాదాపు 300 మంది మహిళలు దేశ చట్టసభలో ప్రత్యక్ష పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి కీలక ముందడుగు. కానీ నిజమైన నిబద్ధత మాటల్లో కాదు.. అమలులో, నిరంతర చర్యల్లో, నిజమైన సంకల్పంలో కనిపించాలి. ఎన్‌డీఏ గత దశాబ్దంలో ఈ బిల్లును వాయిదా వేసి, ఇప్పుడు రాజకీయ అవసరాల నేపథ్యంలో ముందుకు తీసుకు రావడం అనేక విమర్శలకు దారితీస్తోంది. మహిళా సాధికారతపై నిజమైన నమ్మకం ఉంటే, ప్రభుత్వం పార్టీ స్థాయిలో మార్పులు తీసుకురావాలి, విభిన్న వర్గాలకు న్యాయం చేయాలి, మహిళా నాయకత్వాన్ని ఎన్నికల రాజకీయాలకు మించిన హక్కుగా చూడాలి. భారత మహిళలు చాలా కాలంగా ఈ విప్లవాత్మక నిర్ణయం అమలుకోసం ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఏ ఉద్దేశంతో అమలు చేసినా.. మహిళా రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలకూ ఏకాభిప్రాయం ఉంది. కాకపోతే ఓబీసీ కోటా డిమాండ్ మాత్రమే వస్తోంది. దీనికి సమాధానం చెప్పడం కేంద్రానికి పెద్ద కష్టం కాకపోవచ్చు. మొత్తం మీద డీలిమిటేషన్ బిల్లుతో పోలిస్తే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు తేలికగా పార్లమెంట్ ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది.

మహిళా రిజర్వేషన్ల విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. ఒక్క ఓబీసీ కోటా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం ఎందుకు తీసుకోకూడదనే చర్చ గట్టిగా జరుగుతోంది. దీనికి కేంద్రం కూడా దీటుగానే సమాధానం చెబుతోంది. రాజ్యాంగంలో లేని కోటాలు అమలు చేయమని అడగటం పద్ధతి కాదని వాదిస్తోంది. అంతేకాకుండా ఓబీసీ కోటా పేరుతో మొత్తంగా మహిళలకు రిజర్వేషన్లు అందకుండా చేస్తారా అని నిలదీస్తోంది. ఈ పాయింట్‌తో ప్రతిపక్షాన్ని కార్నర్ చేసి బిల్లు ఆమోదించుకునే ఉద్దేశంతో కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లుకు రిజర్వేషన్లో రిజర్వేషన్ అడ్డంకిగా మారొచ్చనే సందేహాలున్నా.. అదేం పెద్ద విషయం కాదనే భావనలోనే కేంద్రం ఉంది. ఇప్పటికే కొన్ని పార్టీలు మహిళా బిల్లుకు మద్దతిస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. ఎలా చూసుకున్నా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. భిన్నాభిప్రాయాలూ వస్తున్నాయి. కానీ మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు విషయంలో వాదోపవాదాలు అంత ఉధృతంగా ఏమీ జరగడం లేదు. ఇక్కడ ప్రాంతాల మధ్య అన్యాయం లాంటి అంశాలు లేకపోవడంతో.. బిల్లు తేలికగా గట్టెక్కటానికే అవకాశం ఉంది. ఇప్పటికే ఉభయసభల్లో ఈ బిల్లుకు చర్చ జరిగే సమయాన్ని కూడా ఖరారు చేసిన కేంద్రం దూకుడుగా ముందుకెళ్తోంది. గతంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి.. ఇప్పుడు హడావుడి చేస్తున్నారన్న విమర్శలకు కూడా ప్రధాని మోడీ ఇప్పటికే ఢిల్లీ మహిళా సదస్సులో సమాధానం చెప్పారు. మొదట్లో ఆలస్యం అవుతుందనుకున్న మాట నిజమేనని, కానీ విపక్షం ఏకాభిప్రాయంతో వెంటనే అమలు చేయాలనడంతో.. తాము పునరాలోచన చేశామని ప్రధాని చెప్పారు. ఆ సూచన సబబనిపించే.. ఇప్పుడు సవరణ చేస్తున్నామని, ఇందులో తప్పేముందని మోడీ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో కూడా ఆయన ఇదే వాదన వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డీలిమిటేషన్‌ తో, సీట్ల పెంపుతో అన్ని పార్టీలకూ అంతిమంగా రాజకీయ లబ్ధి జరుగుతుందనే వాదన ఉండనే ఉంది. ఆ సంగతి తెలిసినా ప్రతిపక్షం కొన్ని హేతుబద్ధమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఇక్కడ ఏదో అధికార పక్షాన్ని వ్యతిరేకించాలని చూడటం కాదని, పార్లమెంట్‌లో ఏకాభిప్రాయంతో ఈ బిల్లులు ఆమోదం పొందితే అది దేశానికే గౌరవమనే వాదనను ప్రతిపక్షం వినిపిస్తోంది. నిజానికి కీలక సందర్భాలు, ప్రాధాన్యత ఉన్న బిల్లుల విషయంలో గతంలోనూ ప్రభుత్వాలు అలాగే వ్యవహరించాయని అది గుర్తుచేస్తోంది. ఇప్పుడు కేంద్రం అన్ని పార్టీలతో పేరుకి సంప్రదింపులు జరిపినా.. అఖిలపక్షం పెట్టకుండానే.. ఆదరాబాదరాగా పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ పెట్టేసి..అనుకున్నది చేయాలనుకోవడం ఏమిటనేదే విపక్షాలు ప్రధానంగా సంధిస్తున్న ప్రశ్న. అదే సమయంలో తమ మద్దతు కూడా బిల్లులుకు కీలకమైనప్పుడు క్రెడిట్ అంతా అధికార పక్షం ఎలా తీసుకుంటుందనేది రాజకీయపరమైన కీలక ప్రశ్న. మరి ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్రం పార్లమెంట్‌లో చెప్పే సమాధానం ఇప్పుడు కీలకం కానుంది.

ఎన్డీఏ సర్కారుకు ప్రతిపక్షం మద్దతు అవసరమైన బిల్లులు పాస్ చేయించుకోవడం కొత్తేం కాదు. కాకపోతే గతంలో పరిస్థితులు వేరు. ఇప్పటి స్థితిగతులు వేరు. ప్రస్తుతం కొన్ని మౌలికపరమైన ప్రశ్నలు, దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతరాలు ఒకేసారి తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా కీలక ప్రశ్నలకు సరైన సమాధానం చెప్ప అవకాశం ఉందనేది విపక్షం వాదన. అందుకే కేంద్రం ప్రస్తుత బిల్లుల విషయంలో రాజకీయాలకు అతీత వైఖరి తీసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ విషయంపై ప్రధాని కూడా ఇదే వైఖరి ప్రదర్శించాలని తమకు లేఖలు రాసిన విషయాన్ని అవి గుర్తుచేస్తున్నాయి. పార్లమెంట్‌లో చర్చ జరిగే సమయంలో పాలకపక్షం వ్యవహరించే తీరే కీలకం అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బిల్లులు.. తాడోపేడో తేల్చేసేవి కానే కాదు. వీటిపై కచ్చితంగా సమగ్రంగా చర్చ జరగాలి. అలాగే పరిష్కారం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇక ఉత్తరాది, దక్షిణాది అంతరాల్ని పూర్తిగా తీసేయలేకపోయినా.. కనీసం తగ్గించటానికి చిత్తశుద్ధితో ప్రయత్నం జరగాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ప్రజాసంఘాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతిపాదనల్ని కూడా పరిగణనలోకి తీసుకుని చర్చ జరిగితే.. మెరుగైన పరిష్కారాలు రావచ్చనే భావన కూడా లేకపోలేదు.

డీలిమిటేషన్ ఎప్పుడు జరిగినా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా చేసుకుంటుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. అందుకే మొదట తమ సందేహాలు నివృత్తి చేశాకే పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతిచ్చే విషయం ఆలోచించాలనుకుంటున్నాయి. ఈసారి లోక్‌సభలో బలం పెంచుకున్న విపక్షం అంత తేలికగా.. కేంద్రం ప్రతిపాదనకు మద్దతిచ్చే అవకాశాల్లేవు. కచ్చితంగా మెరుగైన బేరసారాలు చేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సర్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు.. డీలిమిటేషన్‌ను మరింతగా భూతద్దంలో పెట్టి చూస్తాయనడంలో సందేహమే లేదు. ఏమరుపాటుగా ఉంటే.. కేంద్రం తమకు రాజకీయంగా సమాధి కడుతుందనే ఎరుక అన్ని పార్టీలకూ ఉంది. ఎన్నికల్లో పోటీ చేయకుండానే సగం గెలుపు ఖాయం చేసుకునే ఉద్దేశంతో డీలిమిటేషన్ జరగకుండా జాగ్రత్తపడాలని విపక్షాలు కూడా ఓ అభిప్రాయానికి వచ్చాయి. ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే వ్యూహరచన కోసం విపక్షాలు ఇప్పటికే చర్చించుకున్నాయి. కేంద్రం విభజించి పాలించే వ్యూహరచన చేసినా.. దాన్ని కూడా తిప్పికొట్టాలని అనుకున్నాయి. సమావేశంలో ఏం అనుకున్నామో.. పార్లమెంట్‌లో దానికే కట్టుబడి ఉండాలని.. గతంలో మాదిరిగా మధ్యలో జారిపోయి.. పాలకపక్షానికి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని అనుకున్నాయి.

కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టుగా సీట్ల సంఖ్య పెరిగితే.. అన్ని పార్టీలకూ రాజకీయ అవకాశాలు వచ్చే మాట నిజమే. కానీ రాష్ట్రాల్లో పెరిగే స్థానాల సంఖ్య, ప్రాతిపదిక విషయంలో కూడా ఇంతే ఉదారంగా ఉంటారా.. అక్కడ ఏమైనా మెలిక పెడతారా అనేది అందరికీ ఉన్న సందేహం. ఇక్కడ కేవలం పార్టీలు, నేతలే కాకుండా సామాన్యులు కూడా కీలక బిల్లుల్లో ఏం ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాట వాస్తవం. అంతగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కేంద్రం.. తీరా చర్చలో ఏం చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వీటికి తెరదించటానికి వచ్చిన అవకాశాన్ని కేంద్రం సద్వినియోగం చేసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అన్ని ప్రాంతాలకూ సరైన ప్రాతినిధ్యం.. ఓటు విలువకు సమాన గుర్తింపు అనే కీలక సూత్రాలు దృష్టిలో పెట్టుకుంటే.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. అసలు కీలకమైన అంశాల్లో వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వివాదాలు తలెత్తినా.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటు పాలక పక్షం.. ఇటు ప్రతిపక్షం రెండూ రాజకీయ పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి.. అందరికీ మేలు జరగాలనే కోణంతో చర్చలో పాల్గొంటే.. కచ్చితంగా మేలైన పరిష్కారం దొరుకుతుందనడంలో సందేహం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Congress political debate
  • census and delimitation India
  • delimitation debate India
  • India politics 2026
  • Lok Sabha seat increase

తాజావార్తలు

  • Singer Mangli: “మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు”.. స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ..

  • Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!

  • PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం

  • Rajat Patidar: కోహ్లీ వల్ల కాదు.. ఆ ‘స్టన్నింగ్ క్యాచ్’ వల్లే మ్యాచ్‌ గెలిచాం.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • 8th Pay Commission: భారీ డిమాండ్.. కనీస వేతనం రూ.69 వేలు..!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions