Site icon NTV Telugu

బలమైన గాలుల దెబ్బకు కూలిన ‘Statue Of Liberty’ ప్రతిరూపం.. వీడియో వైరల్

Statue Of Liberty

Statue Of Liberty

Statue Of Liberty: బ్రెజిల్ దక్షిణ భాగంలో సోమవారం (డిసెంబర్ 15) తీవ్ర తుఫాన్ గువైబా నగరాన్ని అతలాకుతలం చేసింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గువైబాలో, హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం బలమైన గాలుల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. భారీ విగ్రహం నెమ్మదిగా ముందుకు ఒరిగి ఖాళీ పార్కింగ్ స్థలంపై పడిపోతున్న దృశ్యాలు అందరినీ భయపెట్టేలా చేశాయి.

Upasana: కంగ్రాట్స్.. మెగా కోడలికి అరుదైన గౌరవం.. ఉపాసనకు ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు..!

బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ డిఫెసా సివిల్ (Defesa Civil) తెలిపిన వివరాల ప్రకారం.. తుఫాన్ సమయంలో గాలి వేగం గంటకు 90 కిలోమీటర్లకు మించి నమోదైందని పేర్కొన్నారు. గువైబా మెట్రోపాలిటన్ ప్రాంతమంతా తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. 2020లో ఇంజినీర్ల సర్టిఫికేషన్‌తో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం 11 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ బేస్‌పై అమర్చబడింది. అయితే, విగ్రహం కూలినా బేస్ మాత్రం ఎలాంటి నష్టం లేకుండా నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. విగ్రహం కూలిపోవడానికి క్షణాల ముందే అక్కడ ఉన్న సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై పార్కింగ్‌లో ఉన్న వాహనాలను తొలగించడంతో ప్రమాదం తప్పింది. హావన్ సంస్థ కూడా వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసి, భద్రతా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. కొన్ని గంటల్లోనే శిథిలాలను తొలగించగా, స్టోర్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించింది.

Tollywood : కెరీర్ ను టర్న్ చేసే సినిమా కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా ఈ తుఫాన్ ప్రభావానికి లోనయ్యాయి. టియో హ్యూగోలో వడగళ్ల వాన కురవగా.. పాసో ఫుందో, సాంటా క్రూజ్ డో సుల్, వేరా క్రూజ్ ప్రాంతాల్లో పైకప్పులు దెబ్బతిన్నాయి. లాజియాడోలో భారీ వర్షాల కారణంగా స్థానికంగా వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదని, 2021లో కపావో దా కానోయాలో గంటకు 70–80 కిలోమీటర్ల వేగంతో వీచిన సైక్లోన్ సమయంలో మరో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయిందని హావన్ గుర్తు చేసింది. అప్పట్లో కూడా కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. తాజా ఘటన అనంతరం ఇంజినీరింగ్ బృందాలు సాంకేతిక పరిశీలనలు ప్రారంభించాయి.

Exit mobile version