Sriman: తమిళ పరిశ్రమలో వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు ‘శ్రీమన్’. అయితే, తాను పక్కా తెలుగువాడైనప్పటికీ టాలీవుడ్‌లో ఆశించిన గుర్తింపు రాలేదనే లోటు తనలో ఉండిపోయిందని ఆయన తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ సంబంధించి శ్రీమన్ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన మనసులోని మాటలను పంచుకున్నారు.
నన్ను గుర్తుపడతారు.. కానీ నా పేరు తెలియదు!
తాను తూర్పు గోదావరి జిల్లా గొల్లాలమామిడాడకు చెందిన తెలుగు అబ్బాయినే అని శ్రీమన్ చెప్పుకొచ్చారు. నన్ను ఎయిర్‌పోర్ట్‌లలోనో, రైల్వే స్టేషన్‌లలోనో చూసినప్పుడు తెలుగు ప్రేక్షకులు దగ్గరకు వస్తారు. ‘సార్.. మిమ్మల్ని ఫలానా సినిమాలో చూశాం, చాలా బాగా చేశారు’ అని పొగుడుతూ సెల్ఫీలు తీసుకుంటారు. కానీ చివర్లో ‘మీ పేరేంటి సార్?’ అని అడుగుతారు. ఇన్ని వందల సినిమాలు చేసినా తెలుగు గడ్డపై నా పేరు రిజిస్టర్ కాకపోవడం లోపల ఒక వెలితిగా ఉండిపోయింది అని శ్రీమన్ ఒకింత బాధ పడ్డారు.
తెలుగు డైలాగ్ చెప్పి చాలా కాలమైంది..
తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యేటప్పుడు తన పాత్రలకు తానే వాయిస్ ఇచ్చుకుంటానని.. కానీ నేరుగా తెలుగు సినిమాలో నటించి, ఇక్కడి డైలాగులు మాట్లాడి రెండు మూడు సంవత్సరాలు దాటిందని ఆయన అన్నారు. ఒక మంచి గుర్తింపు ఉన్న తెలుగు దర్శకుడితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మొహమాటం కొద్దీ ఎవరినీ అవకాశాలు అడగలేకపోయానని తెలిపారు.
అనిల్ రావిపూడితో ఛాన్స్..
విజయ్ నటించిన ‘వారిసు’ (వారసుడు) షూటింగ్ సమయంలో నిర్మాత దిల్ రాజు ద్వారా దర్శకుడు అనిల్ రావిపూడితో శ్రీమన్‌కు పరిచయం ఏర్పడింది. “అనిల్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. 2022లో ఆయనను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నటుడిగా నా పాత సినిమాలు, నా ఎక్స్‌ప్రెషన్స్ ఆయనకు బాగా గుర్తున్నాయి. ఈ సినిమాలో నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ఈ ఒక్క అవకాశం కోసం తమిళంలో ఒప్పుకున్న ఓ 4 సినిమాలను కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేశాను. ఈ చిత్రంతో ‘శ్రీమన్ ఒక తెలుగు కుర్రోడు’ అని ఇక్కడి ప్రేక్షకులకు పూర్తిగా తెలిసిపోతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేశ్ వంటి పెద్ద తారాగణంతో, జి.వి. ప్రకాష్ లాంటి టాలెంటెడ్ సాంకేతిక బృందంతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్న శ్రీమన్.. తాను ఎప్పుడూ ఒక ‘డైరెక్టర్స్ యాక్టర్’ లాగే ఉంటానని, తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ముగించారు. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ అనిల్ రావిపూడికి కొన్ని వేలసార్లు థాంక్స్ చెప్పిన సరిపోదంటూ ఎమోషనల్ అయ్యారు.
🙏 to god
Thanks to Anil Garu
Never expected a straight film in Telugu,One week shoot completed, just pinched myself for the confirmation that I’m working in my mother tongue,set is with positive energy,comedy rollercoaster, omg full fun blessed to work with this Amazing team pic.twitter.com/fCUlkVAUPQ— actor sriman (@ActorSriman) July 3, 2026

