NTV Telugu Site icon

Bhadrachalam: నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం..

Badrachalam

Badrachalam

శ్రీరామ నవమి సందర్బంగా నేడు (బుధవారం) భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగబోతుంది. శ్రీ సీతారామల కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరగనుంది. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిలా కళ్యాణ మండపంకు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కళ్యాణ క్రతువు కొనసాగనుంది. అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉండటంతో భద్రాచలంలో జరిగే శ్రీరాముడి కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమర్పించనున్నారు. 1800 మంది పోలీసులతో ఆలయ పరిసరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: Jharkhand : జార్ఖండ్‌లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

ఇక, శీరామ నవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి తరలి వచ్చే అవకాశం ఉంది. అలాగే, 31 వేల మంది భక్తులు కళ్యాణం వీక్షించేలా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. కళ్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభితమైన మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. ఎండలు, ఉక్కబోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 50 టన్నుల ఏసీతో పాటు, వంద కూలర్లు, 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

ఇక, రాములోరి కళ్యాణానికి తరలివచ్చిన అశేష భక్త జనానికి ఇబ్బందులు లేకుండా ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదాలు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తజనానికి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు కొనసాగుతుంది. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ శాఖ చేస్తుంది. పార్కింగ్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్యూఆర్ కోడ్ తో భక్తులకు పోలీసులు దిశా నిర్దేశం చేస్తున్నారు.