NTV Telugu Site icon

Free Tourist Visas: భారత్‌తో పాటు 6 దేశాలకు శ్రీలంక ‘ఉచిత టూరిస్ట్ వీసాలు’

Srilanka

Srilanka

Free Tourist Visas: శ్రీలంక దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై ఆ దేశం మరింత దృష్టి పెట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం టూరిస్టులను ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువ పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మన దేశానికి చెందిన పౌరులకు ‘ఫ్రీ టూరిస్ట్ వీసా’లను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషషన్ శాఖ కొలంబోలో ప్రకటించింది.

2019 ఈస్టర్ పేలుళ్లు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రధానంగా ఈ రంగంపైనే ఆధారపడిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అయితే తాజాగా భారత్‌తో పాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలను జారీ చేయాలని అక్టోబర్ నెలలో ఆ దేశ క్యాబినెట్ల నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అమలు చేయనుంది.

Read Also: Uttarakhand Tunnel Operation: ఇంకా 2 మీటర్ల దూరమే.. రాత్రంతా కొనసాగనున్న డిగ్గింగ్ పనులు?

మొదటి 30 రోజుల పాటు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31, 2024 నుంచి అమలులోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది. ప్రయాణికుల రాక తర్వాత డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇవ్వబడుతుంది. 30 రోజుల వీసా వాలిడిటీతో ద్వీప దేశంలో 30 రోజులు స్టే చేయవచ్చు. శ్రీలంకకు భారత్ టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అక్టోబర్ 2023లో ఆ దేశానికి 28,000 భారత టూరిస్టులు వెళ్లారు. ఇండియా టాప్ పొజిషన్‌లో ఉంటే.. 10,000 మందితో రష్యా రెండో స్థానంలో నిలిచింది. ఈ తర్వాత యూకే ఉంది.

2019లో ఈస్టర్ బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లింది. ఈ ఘటనలో 270 మంది మరణించారు. ఇందులో 11 మంది భారతీయులు ఉన్నారు. 500 మంది గాయపడ్డారు.ఆ తర్వాత నుంచి క్రమంగా పర్యాటకుల సంఖ్య తగ్గింది. గతేడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆహారం, మెడిసిన్స్, ఇంధనం ఇలా అన్నింటికి ఇబ్బందులు పడింది.