Site icon NTV Telugu

Sri Chaitanya School Ragging: శ్రీచైతన్య స్కూల్లో ర్యాగింగ్.. ఐరన్ బాక్స్‌తో పొట్ట, చేతులపై విచక్షణారహితంగా వాతలు!

Sri Chaitanya

Sri Chaitanya

కాలేజీల్లో ర్యాగింగ్ భూతం ఎంత దారుణంగా ఉంటుందో మనం చూశాం. ఐతే ప్రభుత్వాలు ర్యాగింగ్ మీద దృష్టి పెట్టడంతో దాదాపు ఇప్పుడు కంట్రోల్‌లోనే ఉంది. కానీ విచిత్రంగా ఓ కార్పోరేట్ స్కూలులోనే ర్యాగింగ్ మళ్లీ చిగురించడం కలకలం రేపుతోంది. నిజానికి స్కూల్లో ర్యాగింగ్ చాలా తక్కువ. కానీ రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు.

ఇక్కడ చూడండి.. బెడ్‌పై దీనంగా పడుకుని ఉన్న ఈ బాలుడి పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం స్వస్థలం. ఈ బాలుడ్ని మంచిగా చదివించేందుకు తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులోని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పిల్లాడు మాత్రం.. హస్టల్లో జరిగిన ర్యాగింగ్ భూతం కారణంగా ఇలా రాజోలులోని ఆస్పత్రి బెడ్‌పై చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

విన్సెంట్ ప్రసాద్.. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. అందరు విద్యార్థులతో బాగానే ఉంటాడు. కానీ అందులో ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ హాస్టల్లో వెకిలి పనులు చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాను తీసేశారు. దీనిపై ప్రిన్సిపాల్ అందరినీ నిలదీశారు. ఆ సమయంలో విన్సెంట్ ప్రసాద్.. సీసీ కెమెరా తొలగించిన విద్యార్థుల పేర్లు చెప్పాడు. దీంతో కక్ష కట్టిన ఆ ఇద్దరు స్టూడెంట్స్… పైశాచికంగా ప్రవర్తించారు. తమ మీదే ప్రిన్సిపల్‌కు చెబుతావా అంటూ ఐరన్ బాక్స్‌తో పొట్ట, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. దీంతో విన్సెంట్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఆ కాలిన గాయాలను విన్సెంట్ ప్రసాద్ ఓర్చుకున్నాడు. తనను మళ్లీ ఏదైనా చేస్తారేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. చివరకు మెల్లగా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం విన్సెంట్ ప్రసాద్ కోలుకుంటున్నాడని పేరెంట్స్ చెప్పారు. ఐతే లక్షల రూపాయలు ఖర్చు చేసి చదివిస్తుంటే.. శ్రీచైతన్య యాజమాన్యం ఏ మాత్రం పిల్లల బాగోగులు పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

Exit mobile version