SriKalahasti: శివభక్తుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్తకన్నప్ప. ఈయన ఆటవికుడు అయినా అణువణువునా ఈశ్వర భక్తితో జీవితం గడిపాడు. శ్రీ కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీ భక్త కన్నప్ప స్వామి దేవాలయం ఒకటి. దీనిని స్థానికులు కన్నప్ప కొండ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, కన్నప్ప ఈ కొండపై ఉండి శివుడిని పూజించేవాడు. కొండపైన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 300 మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం, మొత్తం 4 గోపురాలు, ద్వజ స్తంభాలు, శిఖరాలు, సువర్ణముఖి నదీ వీక్షణను అందంగా చూడవచ్చు.
భారతదేశంలోని పంచభూత శివలింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. 5 ఆలయాలలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా.. వాయు శివలింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఈ దేవాలయం అన్ని శైవ క్షేత్రాలలో చాలా విశిష్టమైనది. ఈ క్షేత్రంలోని శివలింగం నవగ్రహ కవచంతో భక్తులను గ్రహ దోషాల నుండి కాపాడుతుంది. సర్ప దోష నివారణకు శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజ నిర్వహిస్తారు. ఈ ఆలయం తిరుపతి నగరానికి 43 కి.మీ, తిరుపతి విమానాశ్రయానికి 26 కి.మీ దూరంలో ఉంది. భక్త కన్నప్ప స్వామి దేవాలయం విశేషాలను తెలుసుకుందాం.