Telugu Player Nitish Kumar Reddy Stats and Info: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు ఆటగాడు సత్తాచాటాడు. తెలుగు తేజం అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ఓ దశలో సన్‌రైజర్స్ 120-130 పరుగులు అయినా చేస్తుందా? అనుకున్నా.. 182 పరుగుల భారీ స్కోర్ సాధించిందంటే అందుకు కారణం నితీష్.
హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్‌క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన నితీష్ రెడ్డి సత్తాచాటాడు. 28 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్.. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదట ఆచితూచి ఆడిన నితీష్.. కాస్త కుదురుకున్నాక విధ్వంసం సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రబాడ, కరన్ లాంటి అంతర్జాతీయ పేసర్లను దీటుగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. అతడి మెరుపులతోనే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. ప్రస్తుతం నితీష్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఎవరీ నితీష్ రెడ్డి అని క్రికెట్ ఫాన్స్ వెతుకుతున్నారు.
2003 మే 26న విశాఖపట్నంలో నితీష్ రెడ్డి జన్మించాడు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఇష్టం. 14 ఏళ్ల వయస్సులో విజయ్ మర్చంట్ ట్రోఫీ (2017-18)లో ఆంద్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు చేయడమే కాకూండా.. బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. దాంతో బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2020లో ఆంధ్ర తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2021లో లిస్ట్-ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు.
2021లో నితీష్ రెడ్డి టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడి 566 పరుగులు, 52 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 403 పరుగులు, 14 వికెట్లు తీశాడు. ఆంధ్రా తరపున 8 మ్యాచ్‌లు ఆడిన నితీష్.. 106 పరుగులు సాధించాడు. దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అతడిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో రెండే మ్యాచ్‌లు ఆడాడు.
Also Read: Road Accident: గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!
హిట్టింగ్ చేస్తున్న నితీష్ రెడ్డిని ఐపీఎల్ 2024లో ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ భావించింది. ఈక్రమంలోనే చెన్నైతో మ్యాచ్‌లో లోయర్ మిడిలార్డర్లో దింపింది. ఛేదనలో 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక పంజాబ్‌పై ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి.. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ అందుకున్నారు. నితీష్ మరింతగా చెలరేగాలని తెలుగు ఫాన్స్ కోరుకుంటున్నారు.