NTV Telugu Site icon

MS Dhoni-Nitish Reddy: ధోనీని అవమానించలేదు.. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: నితీశ్ రెడ్డి

Ms Dhoni Nitish Reddy

Ms Dhoni Nitish Reddy

SRH Player Nitish Kumar Reddy Says Please Watch Full Video on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తనకు ఎంతో గౌరవం ఉందని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని ఎడిట్ చేసి.. ధోనీపై నెగటివ్‌గా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. ధోనీ గురించి తాను మాట్లాడిన వీడియోను పూర్తిగా చూడాలని నితీశ్ రెడ్డి కోరాడు. ఐపీఎల్ 2024లో నితీశ్ 303 రన్స్ చేశాడు. టోర్నీ ఆరంభంలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆంధ్రా ఆటగాడు.. ఆపై తక్కువ స్కోర్స్ చేస్తూ నిరాశపరిచాడు.

టాలీవుడ్ యువ హీరో కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నితీశ్ కుమార్ రెడ్డిని కార్తీకేయ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. క్రికెట్, ఇతర విషయాల గురించి నితీశ్‌ని కార్తికేయ ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో ‘కొందరి ఆటగాళ్లకు నైపుణ్యం సహజ సిద్ధంగా ఉంటుంది, మరికొందరు కష్టపడి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. వీరిలో ఎవరు ఎక్కువ విజయవంతం అవుతారు’ అని కార్తికేయ అడిగాడు. ‘ఆటలో ఒత్తిడిని జయించడమే ముఖ్యం. ఎంత టాలెంట్ ఉన్నా.. ఒత్తిడిని అధిగమించకపోతే ఫలితం ఉండదు. విరాట్ కోహ్లీతో పోలిస్తే ఎంఎస్ ధోనీకి టెక్నిక్ అంతగా ఉండదు. కానీ మహీ మైండ్ సెట్ గొప్పగా ఉంటుంది. మ్యాచ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగాడు’ అని నితీశ్‌ పేర్కొన్నాడు.

Also Read: Team India Coach: కేకేఆర్‌కు గుడ్ బై.. టీమిండియా కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌!

ఎంఎస్ ధోనీకి టెక్నిక్ లేదు అని నితీశ్ రెడ్డి చెప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన మహీ, టీమిండియా ఫాన్స్ నితీశ్‌పై మండిపడ్డారు. ఓ దిగ్గజ క్రికెటర్‌ను తక్కువ చేస్తావా?, టెక్నిక్ తెలియకుండానే భారత్‌కు అన్ని రన్స్ చేశాడా?, టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు ఎలా అందించాడు? అని నితీశ్‌ను ఓ ఆటాడుకున్నారు. ఈ విమర్శలపై తాజాగా నితీశ్ వివరణ ఇచ్చాడు. ధోనీ అంటే తనకి అపారమైన గౌరవం అని, వీడియో క్లిప్‌ను ఎడిట్ చేసి తనపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. అందరూ పూర్తి వీడియోను చూడాలని కోరాడు.

Show comments