Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?

Kohli And Vaibhav

Kohli And Vaibhav

2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ మళ్లీ భాగం కానుంది. దాదాపు ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు ఒలింపిక్స్‌లో కనిపించబోతున్నాయి. చివరిగా 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ మెగా టోర్నమెంట్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో ఆరు జట్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది.

ఈ 2028 ఒలింపిక్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మొత్తం ఐదు కొత్త ఆటలను ఆమోదించింది. క్రికెట్‌తో పాటు బేస్ బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రాస్, స్క్వాష్ ఆటలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రికెట్ జట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే భారతదేశానికి 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ బౌలర్ ఎస్. శ్రీశాంత్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు.

×
×
Ad

ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు నమ్మశక్యం కానివని కొనియాడారు. మనం ఒలింపిక్ బంగారు పతకం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా జట్టులో ఉండాలని ఆయన కోరారు. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు, జూనియర్ ఆటగాళ్ల కలయిక చాలా అవసరమని, ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీతో కలిసి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తే ఆ ఆట చూడ ముచ్చటగా ఉంటుందని.. అది కూడా ఇద్దరినీ ఓపెనర్లుగా పంపాలని శ్రీశాంత్ అభిప్రాయపడ్డారు.

సెలక్టర్లు విరాట్ కోహ్లీని టీ20 జట్టులోనే కొనసాగించాలని, ఆయనకు ఉన్న ఫిట్‌నెస్ స్థాయి అద్భుతమని శ్రీశాంత్ పేర్కొన్నారు. నా ఈ వ్యాఖ్యలు కొంతమందికి వివాదాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున విరాట్ కోహ్లీని ఆడించాలని సెలక్టర్లను తాను చేతులు జోడించి వేడుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. విరాట్ కోహ్లీ 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు.. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు తాజాగా భారత జట్టులోకి ఎంపిక చేశారు.

ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశపెట్టడం వల్ల భారతదేశానికి బంగారు పతకం గెలుచుకునే గొప్ప అవకాశం లభిస్తుంది. భారత్ ఇప్పటికే రెండు సార్లు వన్డే ప్రపంచ కప్, మూడు సార్లు టీ20 ప్రపంచ కప్‌లను సొంతం చేసుకుంది. అందువల్ల లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడానికి టీమిండియానే అత్యంత బలమైన జట్టుగా బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు.