Sreesanth touches Yuvraj feet: మాజీ టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ మరోసారి తన వినయంతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ను కలిసిన సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొచ్చి సమీపంలోని గోల్ఫ్ వ్యూ క్లబ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియోలో శ్రీశాంత్ ఎంతో ఆప్యాయంగా యువరాజ్‌ను పలకరిస్తూ, “యువీ భాయ్.. మీ పాదాలకు నమస్కారం” అని చెప్పడం కనిపించింది. అంతేకాదు గోల్ఫ్ సెషన్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపాడు.
ఇటీవల యువరాజ్ సింగ్ గోల్ఫ్ ఆటను బాగా ప్రోత్సహిస్తున్నాడు అలాగే ఆడుతున్నాడు కూడా. పలుచోట్ల గోల్ఫ్ ఈవెంట్లలో పాల్గొంటూ ఆటపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల రిషబ్ పంత్ కూడా యువరాజ్‌కు ప్రత్యేకంగా గోల్ఫ్ క్లబ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే శ్రీశాంత్, యువరాజ్ మధ్య అనుబంధం చాలా ఏళ్ల నాటిది. ఇద్దరూ కలిసి భారత్‌కు 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్‌లో కూడా ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరూ అప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.
తన కెరీర్ ప్రారంభ దశలో యువరాజ్ ఎంతో సహాయం చేశాడని శ్రీశాంత్ అనేకసార్లు చెప్పాడు. 2008 ఐపీఎల్‌లో జరిగిన ‘స్లాప్ గేట్’ వివాద సమయంలో కూడా యువరాజ్ సింగ్, శ్రీశాంత్‌కు మద్దతుగా నిలిచాడు. ఆ ఘటనను అప్పట్లో “చాలా దారుణం.. అస్సలు అంగీకరించలేనిది” అంటూ తీవ్రంగా విమర్శించాడు కూడా. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య ఉన్న బంధం అభిమానులను ఆకట్టుకుంటోంది. శ్రీశాంత్ చూపిన గౌరవం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
S. Sreesanth touching the feet of Yuvraj Singh.❤️
The love and respect he has for his teammates is truly special. 🫶🏻 pic.twitter.com/zRPsJGItlx
— Rohan💫 (@rohann__45) May 11, 2026
