Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..

Sreesanth

Sreesanth

Sreesanth: భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2023 డిసెంబర్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తీవ్రమైన వాగ్వాదం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ సమయంలో గంభీర్ తనను ‘ఫిక్సర్’ అని దూషించాడంటూ శ్రీశాంత్ గతంలోనే ఆరోపించాడు. అయితే, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవకు సంబంధించిన మరికొన్ని షాకింగ్ నిజాలను శ్రీశాంత్ బయటపెట్టాడు. గంభీర్ తనను కేవలం ఫిక్సర్ అనడమే కాకుండా, ‘దేశద్రోహి’ అని కూడా సంబోధించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘ది లల్లన్‌టాప్’ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ.. మ్యాచ్ సందర్భంగా తాను గంభీర్‌కు ఒక బౌన్సర్ వేసిన తర్వాత ఈ గొడవ మొదలైందని చెప్పాడు. “గౌతీ (గంభీర్) చాలా మంచి క్రికెటర్, నా ఆట తీరు అతనికి బాగా తెలుసు. అందుకే నేను వేసిన మొదటి బంతికే అతను ముందుకు వచ్చి ఫ్లిక్ షాట్ ఆడాడు. కోచింగ్ విషయంలో అతని ప్రతిభ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, ఒక క్రికెటర్‌గా మాత్రం అతను గొప్పోడే. ఆ షాట్ తర్వాత నేను అతనికి ఒక బౌన్సర్ వేశాను” అని శ్రీశాంత్ వివరించాడు. ఆ బౌన్సర్ తర్వాత గంభీర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడని, నేరుగా తనపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడని శ్రీశాంత్ ఆరోపించాడు. “ఆ బౌన్సర్ తర్వాత గంభీర్ నా వైపు చూస్తూ ‘ఐ ఓన్ యూ’ (నువ్వు నా చేతిలో ఉన్నావ్) అన్నాడు. నన్ను స్పష్టంగా బూతులు తిట్టాడు. అసలు అనకూడని మాట అన్నాడు.. నన్ను ‘ఫిక్సర్’ అని పిలిచాడు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. గంభీర్ అలా అనేసరికి తాను కాస్త ముందుకు వంగి, ‘గౌతీ భాయ్, మీరు బానే ఉన్నారా?’ అని అడిగానని శ్రీశాంత్ చెప్పాడు. అయితే తాను భారీ కాయంతో ఉండటం వల్ల గంభీర్‌ను కొట్టడానికి వెళ్తున్నట్లుగా కనిపించి ఉండవచ్చని, కానీ గంభీర్ మాత్రం ‘F’ అక్షరంతో మొదలయ్యే బూతు మాటలు వాడుతూ, మళ్లీ ‘ఫిక్సర్’, ‘దేశద్రోహి’ అని అరిచాడని శ్రీశాంత్ సంచలన క్లెయిమ్ చేశాడు.

×
×
Ad

నిజానికి గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములు. 2007 టీ20 ప్రపంచ కప్, అలాగే 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్లలో వీరిద్దరూ కలిసి ఆడారు. కానీ, ఆటగాళ్లుగా రిటైర్ అయిన తర్వాత వీరి మధ్య సంబంధాలు ఎంత ఘోరంగా దెబ్బతిన్నాయో ఈ తాజా వివాదం స్పష్టం చేస్తోంది. 2013 ఐపీఎల్ సీజన్‌లో శ్రీశాంత్‌పై వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల ఆధారంగానే గంభీర్ ఆనాడు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ కేసులో శ్రీశాంత్‌పై మొదట బీసీసీఐ జీవితకాల నిషేధం విధించినప్పటికీ, ఆ తర్వాత దానిని ఏడేళ్లకు తగ్గించింది. దీంతో 2020లో శ్రీశాంత్ తిరిగి క్రికెట్ ఆడటానికి అర్హత సాధించాడు.