Cricket’s ‘Impossible’ Record: భారత దేశంలో ఆటలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు క్రికెట్. ఇండియన్స్ అంతలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు క్రికెట్‌ను. నిజానికి క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన వాళ్లు ఉన్నారు, ఆ రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించిన పేయర్స్ కూడా ఉన్నారు. కానీ క్రికెట్ చరిత్రలో అసాధ్యం అన్న రికార్డును.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరంటే ఇద్దరికి మాత్రమే సాధ్యమైనది ఒకటి ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి, వాటిని సాధించిన ఆ ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Daily Water Intake by Age: ఏ వయస్సు వారు.. రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి..?
క్రికెట్ ప్రపంచంలో చాలా మంది భయంకరమైన బ్యాట్స్‌మెన్‌లు వచ్చారు, పోయారు, కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. బ్యాటింగ్‌కు దిగిన ఆ బ్యాట్స్‌మెన్‌ను చూస్తే ప్రత్యర్థి బౌలర్‌కు ఒక రకమైన భయాన్ని కలిగించిన వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే. అలాంటి తక్కువ మందిలో భారతదేశానికి చెందిన వీరేంద్ర సెహ్వాగ్, వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత సవాలుతో కూడిన ఫార్మాట్‌లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) తమ బ్యాట్‌లతో విధ్వంసం సృష్టించి క్రికెట్ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సంపాదించుకున్న అరుదైన ఆటగాళ్లు ఈ ఇద్దరు. నిజానికి ఈ ఇద్దరూ కూడా ఎవరూ సాధించలేని ఘనతలను సాధించారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ ఈ ఇద్దరూ టెస్ట్ లలో ట్రిపుల్ సెంచరీలు, వన్డేలలో డబుల్ సెంచరీలు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ వీరిద్దరూ మాత్రమే. టెస్ట్‌లలో ఈ ఇద్దరూ రెండుసార్లు ట్రిపుల్ సెంచరీలు చేశారు.
నిజానికి భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా క్రికెట్‌లో అనేక వ్యక్తిగత రికార్డులను సొంతం చేసుకున్నారు. వారి తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ – క్రిస్ గేల్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులను నెలకొల్పారు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో వీళ్లిద్దరూ ఎవరికి సాధ్యం కానీ అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ ఇద్దరూ టెస్ట్‌లలో ట్రిపుల్ సెంచరీలు, వన్డేలలో డబుల్ సెంచరీలు సాధించి క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన పేజీలను సగౌరవంగా లిఖించుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్థాన్ పై ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ బ్యాట్స్‌మెన్ తన రెండవ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 2004 లో సెహ్వాగ్ ముల్తాన్ లో 309 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 2008 లో చెన్నై లో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 104 టెస్ట్ లలో 8586 పరుగులు చేశాడు. తన సగటు 49.34, అతని ఉత్తమ స్కోరు 319 పరుగులు.
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సెహ్వాగ్ డిసెంబర్ 8, 2011న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. సెహ్వాగ్ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్లతో 219 పరుగులు చేశాడు. 251 వన్డేల్లో అతను 8273 పరుగులు చేశాడు. ఇందులో సెహ్వాగ్ 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్.. అందరూ ముద్దుగా పిలుచుకునే యూనివర్స్ బాస్ కూడా ఈ అరుదైన ఘనతను తన పేరున లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ, వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. సెహ్వాగ్ లాగానే గేల్ టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంకపై గేల్ ఈ ఘనతను సాధించాడు. క్రిస్ గేల్ 2005 లో దక్షిణాఫ్రికాపై 317 పరుగులు, 2010 లో గాలెలో శ్రీలంకపై 333 పరుగులు చేశాడు. 2015 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఫిబ్రవరి 24, 2025న కాన్‌బెర్రాలో జింబాబ్వేపై క్రిస్ గేల్ 215 పరుగులు చేశాడు. అతను 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. క్రిస్ గేల్ 301 వన్డేల్లో 25 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలతో సహా 10,480 పరుగులు చేశాడు.
READ ALSO: Sania Mirza: కొత్త పాత్రలోకి అడుగు పెట్టిన టెన్నిస్ స్టార్ ..