కేంద్ర ప్రయోజిత పథకాలు, నిధుల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదన్నారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టేయాలని సీఎం ఆదేశించారు. సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు రూ.1259 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పెండింగులో ఉన్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి రూ.1200 కోట్లు అడిగామని సీఎంకు మంత్రి లోకేష్ వివరించారు. పీఎంఏవై-అర్బన్ నిధులు ఖర్చు పెట్టే అంశాన్ని పర్యవేక్షించాలనని మంత్రి కొలుసు పార్థసారధికి సీఎం ఆదేశించారు. గతంలో విజిలెన్స్ విచారణ కారణంగా పనులు నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని, తద్వారా పీఎంఏవై -అర్బన్ ఇళ్లకు మరింతగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు.
సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘వివిధ సీఎస్ఎస్ పథకాల ద్వారా రూ.24,513 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంకా రూ.6,252 కోట్ల నిధులు ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వ శాఖలు కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకోవటంలో ఎందుకు వెనుకపడుతున్నాయి. ఏడాది చివరిలో కేంద్రంలోని వివిధ శాఖల వద్ద నిధులు ఉండిపోతున్నాయి. వాటిని సమర్ధంగా వినియోగించుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్‌లో కేవలం 38 శాతం మాత్రమే ఖర్చు చేయడం ఏంటీ. జనవరి నాటికి పీఎంఏవై అర్బన్లో 75 శాతం నిధులు ఖర్చు చేస్తే అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చు. జిల్లా కలెక్టర్లు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ నిధులను త్వరితగతిన ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలి. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు, రాష్ట్ర కృషీ వికాస్ యోజన కింద కూడా త్వరితగతిన నిధులు వినియోగించుకోవాలి. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మిగతా నిధులను కూడా కేంద్రం నుంచి సాధించే అవకాశం ఉంటుంది. నిధులు లేక ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర పథకాల్లో ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడమేంటీ. ఎట్టిపరిస్థితుల్లో కేంద్రం కేటాయించిన రూ.24513 కోట్లు ఖర్చు చేయాల్సిందే’ అని చెప్పారు.
Also Read: Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వం ఉండి ఏం లాభం.. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్!
‘కేంద్ర నిధులు ఖర్చు చేస్తే మరో రూ.5-6 వేల కోట్లు అదనంగా తెచ్చుకుందాం. ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. కేంద్రంలోని సంబంధిత మంత్రులతో టచ్లోకి వెళ్లండి. బడ్జెట్ ప్రిపరేషన్ సమయంలోనే కలిస్తే ఏపీకి అదనంగా నిధులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలలోనే బడ్జెట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలూ తయారీ మొదలు పెడతాయి. 63 వేల ప్రభుత్వ ఖాతాలు ఇన్ యాక్టివ్ గా ఉన్నాయి. ఇన్ యాక్టివుగా ఉన్న ఖాతాల్లో రూ.155 కోట్ల మేర నిధులు బ్యాంకుల్లో ఉండిపోయాయి. ఆ నిధులను విత్ డ్రా చేయించండి.. బ్యాంకుల్లో ఉండిపోయిన నిధులకు సింపుల్ వడ్డీ అయినా వచ్చేలా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఆడిట్స్ త్వరలోనే పూర్తి కావాలి’ అని సీఎం ఆదేశించారు.
