Special Train to Ayodhya: ఏపీలోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్య కుమార్, తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ నుండి అయోధ్యకు వెళుతున్న మొదటి రైలు ఇదేనని.. వేలాది మంది భక్తులను అయోధ్యకు పంపిస్తున్న పుణ్యం ఏపీకి దక్కుతుందన్నారు. శ్రీరాముని చల్లని చూపు ఏపీపై ఉండాలన్నారు. అయోధ్యలో రాముని చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం బీజేపీ కల అని.. దాన్ని నిజం చేసిన నాయకుడు ప్రధాని మోడీ అంటూ కొనియాడారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో ప్రధాని మోడీ ఈ ఆలయం నిర్మించగలిగారన్నారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారం బీజేపీ అగ్రనాయకత్వం చూసుకుంటుందన్నారు. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనేది మీడియా చెబుతుంటే చూస్తున్నామన్నారు. ఎప్పుడు, ఎవరితో భేటీ అవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో బీజేపీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు.
జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాలపై మాకు అవగాహన ఉండదు… అలాంటి విషయాలపై స్పందించడం సరికాదు, కొన్ని పరిమితులు ఉంటాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారని ఆయన మీడియాతో వెల్లడించారు. తినబోతూ రుచి అడగవద్దన్నారు. జరుగుతున్న ప్రచారాలు చూస్తే , మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి, ఆ నినాదంతోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పనిచేస్తుందన్నారు.