Site icon NTV Telugu

Pattabhi Ram: పట్టాభికి బెయిల్ మంజూరు.. కండిషన్స్ అప్లై

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కి ఊరట లభించింది. పట్టాభికి బెయిల్ ఇచ్చింది స్పెషల్ కోర్టు. పోలీసు కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేశారు న్యాయమూర్తి. 25వేల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు జామీనులతో బెయిల్ మంజూరైంది. అయితే, మూడు నెలల పాటు ప్రతీ గురువారం కోర్టుకు హాజరు కావాలలని నిబంధన విధించింది కోర్టు. సాక్షులను ప్రభావితం చేయరాదని, విచారణకు సహకరించాలని జడ్జి ఆదేశించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం, అనంతరం చోటుచేసుకున్న ఘర్షణల కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టయిన సంగతి తెలిసిందే. బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్‌ 15-ఎ సబ్‌ సెక్షన్‌ 3, 5 పొందుపరచడానికి గల కారణాలను న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఫిబ్రవరి 20న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి మరో 13 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. పట్టాభిని వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకుముందు సీఐని కులం పేరుతో తిట్టారని పట్టాభిపై ఆరోపణలు ఉన్నాయి. పట్టాభి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐ కనకారావు తరఫు న్యాయవాది వాదించారు.

పోలీసు అధికారికే రక్షణ లేనపుడు సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని సీఐ కనకారావు తరఫు న్యాయవాది కోర్టుకి వివరించారు. పట్టాభికి నేర చరిత్ర ఉందని, బాధితులకు ఇబ్బందులు కలుగుతాయని వాదనలు వినిపించారు న్యాయవాది.మరోవైపు పట్టాభిని తోట్లవల్లూరు పోలీసు స్టేషను లో కొట్టారని వాదనలు వినిపించారు పట్టాభి తరఫు న్యాయవాది. పట్టాభిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన భార్య పోలీసులపై మండిపడిన సంగతి తెలిసిందే. డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళనకు సిద్ధమయ్యారు పట్టాభి భార్య.

Read Also: S Jaishankar: 6 గంటలకే “కెప్టెన్ మోదీ”తో ఆట మొదలు.. జైశంకర్ నోట క్రికెట్, ఆర్ఆర్ఆర్..

Exit mobile version