NTV Telugu Site icon

Pakisthan: పాకిస్తాన్ రైలు హైజాక్.. జాతీయ భద్రతపై కీలక సమావేశం

Pak

Pak

పాకిస్తాన్‌లో రైలు హైజాక్ ఘటన సంచలనం సృష్టించింది. బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో తొమ్మిది కోచ్‌లలో మొత్తం 440 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్, స్పెషల్ గ్రూప్ కమాండోస్‌తో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రేపు (మంగళవారం) జరుగనుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Read Also: LYCA : ఆర్థిక ఇబ్బందుల్లో ‘లైకా’.. చేతులు మారిన లూసిఫర్ 2

పాకిస్తాన్ వార్తపత్రిక నివేదిక ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ఈ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొని.. ప్రస్తుత భద్రతా పరిస్థితిపై పార్లమెంటరీ కమిటీకి సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కానందున.. రక్షణ, విదేశాంగ వ్యవహారాలపై జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీల సభ్యులు, సమాఖ్య మంత్రివర్గ సభ్యులు, నాలుగు ప్రావిన్సుల ముఖ్యమంత్రులు.. అన్ని పార్లమెంటరీ పార్టీల నాయకులు లేదా వారి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని డాన్ వార్తపత్రిక నివేదించింది.

Read Also: Jharkhand: జార్ఖండ్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనం

ఈ సమావేశానికి ప్రధాన మంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ హాజరు కానున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), ప్రావిన్స్‌లో పెరుగుతున్న ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న ఇతర ఉగ్రవాద గ్రూపులపై ప్రభుత్వం భారీ ఆపరేషన్‌ను ప్లాన్ చేస్తోందని ఆ పత్రిక నివేదించింది. కాగా.. మార్చి 11న పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గుడాలర్, పిరు కున్రి పర్వత ప్రాంతాల సమీపంలో 440 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మెరుపుదాడి చేసింది. మార్చి 12న సైన్యం 33 మంది ఉగ్రవాదులను హతమార్చడానికి ముందు ఉగ్రవాదులు 21 మంది ప్రయాణికులను, నలుగురు పారామిలిటరీ సిబ్బందిని చంపారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఐదు వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు.