South Africa Pacer Gerald Coetzee bowled a big wide vs Netherlands: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ ‘వైడ్’ బాల్స్ వేయడం సహజమే. అయితే ఆ వైడ్ బాల్స్ మార్జిన్స్‌లో ఉంటాయి. క్రీజుకు ఒకటి లేదా రెండు అంగుళాల దూరంలో బంతి వెళుతుంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే బౌలర్ మరీ దూరంగా బంతిని వేస్తాడు. తాజాగా ఓ బౌలర్ భారీ వైడ్ వేశాడు. ఎంతలా అంటే బంతి ఏకంగా కీపర్ చేతుల్లోకి కాకుండా.. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ వైడ్ బాల్ భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో నమోదైంది.
ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సఫారీ పేసర్ గెరాల్డ్ కోట్జీ భారీ వైడ్ వేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన గెరాల్డ్.. మొదటి బంతిని భారీ వైడ్ వేశాడు. బంతి కీపర్ క్వింటన్ డీకాక్ దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా.. ఏకంగా ఫస్ట్ స్లిప్‌లో ఉన్న హెన్రిక్ క్లాసెన్ వద్దకు వెళ్లింది. బంతిని పట్టుకొన్న క్లాసెన్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఆపై డీకాక్ కూడా నవ్వులు పూయించాడు. మ్యాచులో గెరాల్డ్ వేసిన మొదటి బంతి అదే కావడం విశేషం.
ఈ వైడ్ బాల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మరీ ఇంత పెద్ద వైడా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘కెమెరామ్యాన్ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాడు’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ‘ఇంత పెద్ద వైడ్ నేనెప్పుడూ చూడలే’, ‘దెబ్బకు కెమెరామ్యాన్ షాక్ అయ్యాడు’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించింది.