Site icon NTV Telugu

Sourav Ganguly: రాజకీయాలపై ఆసక్తి లేదు.. ఆ పదవికి మాత్రం సిద్ధం!

Sourav Ganguly

Sourav Ganguly

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సులు లేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశారు. క్రికెట్‌తో బిజీగా ఉన్న కారణంగా రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. అయితే టీమిండియా కోచ్‌ పదవి చేపట్టడానికి మాత్రం తాను సిద్ధమని దాదా తెలిపారు. వన్డే ప్రపంచకప్‌ 2027 వరకు ఫిట్‌గా ఉండటం, భారత జట్టులో చోటు సంపాదించడం సీనియర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు అంత సులువు కాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా వ్యవహరించిన దాదా.. క్యాబ్, బీసీసీఐ అధ్యక్షుడిగా పదవులు చేపట్టారు. 2018-19, 2022-24 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్‌కు టీమ్ డైరెక్టర్‌గా గంగూలీ ఉన్నారు.

తాజాగా పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. ‘క్రికెట్‌లో వేర్వేరు భిన్నమైన పాత్రల్లో ఉండటంతో రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. 2013లో క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి బీసీసీఐ అధ్యక్షుడిని అయ్యాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. నాకు ఇప్పుడు 52 ఏళ్లు. టీమిండియా కోచ్‌ పదవి చేపట్టడానికి నేను సిద్ధమే. అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం’ అని దాదా తెలిపారు. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన గంగూలీ.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశారు. భారత జట్టుకు దూకుడు నేర్పిన కెప్టెన్‌ దాదానే అన్న విషయం తెలిసిందే.

‘ప్రతి ఒక్క ఆటగాడి మాదిరిగానే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నుంచి కూడా ఆట దూరమవుతుంది. అలానే ఆటకు వాళ్లు దూరమవుతారని మనం అర్థం చేసుకోవాలి. 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు ఏడాదికి 15 మ్యాచ్‌లు ఆడుతూ ఫిట్‌గా ఉండటం, టీమిండియాలో చోటు సంపాదించడం వారికి అంత సులువు కాదు. ఇద్దరికి నేనిచ్చే సలహా ఏమీ లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత క్రికెట్‌ వారికి కూడా తెలుసు. రోహిత్, కోహ్లీలే నిర్ణయం తీసుకుంటారు. విరాట్ అద్భుతమైన ఆటగాడు. అతడికి ప్రత్యమ్నాయ ఆటగాడు జట్టులోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు.

 

Exit mobile version