NTV Telugu Site icon

Telangana Crime: ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. డ్రామా ఆడి దొరికిపోయాడు..

Delhi Crime

Delhi Crime

Telangana Crime: మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తిపాస్తుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు కసాయి కొడుకు. పైగా హత్యని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయి చివరికి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు. సత్తవ్వకు ఓ కుమారుడు, పోషవ్వకు ఇద్దరు కుమారులున్నారు. మల్లయ్య మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. సత్తవ్వ గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. సత్తవ్వ కొడుకు చంద్రశేఖర్ సిద్దిపేటలో ఉంటున్నాడు. సత్తవ్వ పేరుపై ఐదెకరాలు భూమి ఉంది. ఆ భూమిని తన పేరుపై చేయాలని గత కొన్ని రోజులుగా చంద్రశేఖర్ తల్లితో గొడవ పడుతున్నాడు.

Read Also: AP Crime: లవ్‌ ఫెయిల్.. ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య..

ఇక, ఈ నెల 11న ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ తిరిగి భూమి విషయంలో తల్లితో గొడవపడ్డాడు. సత్తవ్వ మాత్రం తన చెల్లెలు పోషవ్వకి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారని.. అందరికి సమానంగా భూమి పంచుతానని చెప్పింది. దీంతో ఆగ్రహించిన కొడుకు.. తల్లిపై దాడి చేశాడు. తల, శరీర భాగాలపై సత్తవ్వకి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న తల్లి ప్రాణాలు విడిస్తే తనపై వస్తుందన్న ఉద్దేశ్యంతో కట్టుకథ అల్లాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి కిందపడిందని తండ్రికి చెప్పి నమ్మించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా సత్తవ్వ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అంత్యక్రియల కోసం గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే సత్తవ్వ తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, సత్తవ్వ మృతిపై కొడుకుపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకుని వాచారించగా నేరం ఒప్పకున్నారు. ఆస్తి కోసమే హత్య చేసినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Show comments