Site icon NTV Telugu

ఇస్రోకు కొత్త సారథి… ఈనెల 14న బాధ్యతల స్వీకరణ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ నియామకం అయ్యారు. 2018 నుంచి విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా సోమనాథ్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14తో ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పదవీ కాలం ముగియనుంది. అనంతరం సోమనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళకు చెందిన సోమనాథ్ దేశంలో టాప్ రాకెట్ సైంటిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. ఉపగ్రహ వాహక నౌకల డిజైనింగ్‌లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు.

కెరీర్‌ తొలినాళ్లలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ టీమ్ లీడర్‌గా సోమనాథ్ పనిచేశారు. ఇస్రో ఇప్పటిదాకా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక భూమిక పోషించారు. చంద్రయాన్-2 ల్యాండర్ క్రాఫ్ట్ కోసం థ్రోటల్ ఇంజిన్‌లను అభివృద్ధి చేయడం, GSAT-9లో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను తొలిసారిగా విజయవంతం చేయడం వంటివి సోమనాథ్ సాధించిన విజయాల్లో మచ్చుతునకలుగా నిలిచిపోయాయి. కాగా ఈనెల 14న ఇస్రో అధిపతిగా సోమనాథ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

https://ntvtelugu.com/cm-kcr-bringing-new-scheme-for-farmers/
Exit mobile version