Xi Jinping: ఉత్తర సరిహద్దుల్లో చైనీయులతో భారత్ పోరాడుతుండగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచారనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతోపాటు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించినట్లు ఊహాగానాలు వస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లోని అనేక పోస్టుల ప్రకారం.. ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి సమర్‌కండ్‌లో ఉన్న జిన్‌పింగ్ పీఎల్‌ఏ చీఫ్‌గా తొలగించబడ్డారని సమాచారం. అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదా చైనా మీడియా నుండి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా ఈ విషయంపై స్పందించారు.
‘జిన్‌పింగ్ బీజింగ్‌లో గృహ నిర్బంధంలో ఉన్నారా? ఇటీవల సమర్కండ్ సదస్సులో ఉన్న సమయంలో.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన్ను ఆర్మీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించారని, ఆపై హౌస్ అరెస్ట్ చేశారని రూమర్స్ వస్తున్నాయి. అయితే, వాస్తవాలను ధ్రువీకరించాల్సి ఉంది’ అని సుబ్రమణ్యస్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్విటర్‌లో పలువురు చైనా జాతీయులు కూడా జిన్‌పింగ్ గృహనిర్బంధం గురించి పోస్ట్ చేశారు. బీజింగ్‌ను ఆర్మీ ఆక్రమించుకుందని, లీ కియామింగ్‌ను చైనా అధ్యక్షుడిగా నియమించారని కూడా కొందరు ఊహించారు.
ఇటీవల ముగిసిన ఎస్‌సీఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో ఉన్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యారు. దేశం యొక్క కఠినమైన ‘జీరో కోవిడ్ పాలసీ’ని అనుసరించి చైనా ప్రీమియర్ నిర్బంధంలో ఉండవచ్చని కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు సూచించాయి. చైనాలో, విదేశాల నుండి దేశానికి తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తి క్వారంటైన్‌లో ఉండాలి. శనివారం రాజధాని బీజింగ్ మీదుగా చాలా తక్కువ వాణిజ్య విమానాలు ఎగురుతున్నాయని, బీజింగ్ నుంచి అన్ని రైళ్లు, బస్సులు రద్దు చేయబడ్డాయని పుకార్లు కూడా వచ్చాయి.
Fiona Storm: కెనడా తూర్పు తీరాన్ని తాకిన ఫియోనా తుఫాన్.. చీకట్లోనే లక్షల మంది
చైనాలో ఈ వారం ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష, నలుగురు అధికారులకు జీవిత ఖైదు విధించబడింది. నివేదికల ప్రకారం, ఆ ఆరుగురు ‘రాజకీయ కక్ష’లో భాగం. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తోందని, ఆ ఆరుగురు జిన్‌పింగ్‌కు ప్రత్యర్థులేనని భావిస్తున్నారు. అయితే, పలు కథనాలు.. ఈ ఆరుగురిని జిన్‌పింగ్‌కు రాజకీయ ప్రత్యర్థులుగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్‌పై సీనియర్లు తిరుగుబాటు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, జిన్‌పింగ్ గృహ నిర్బంధం అనే వార్తలను ఆయన ప్రత్యర్థి వర్గమే సృష్టించినట్లు వాదనలు ఉన్నాయి.