SLBC Tunnel: SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) అధికారులు స్పష్టం చేశారు. టన్నెల్ లోపల ప్రాణాలతో ఎవరు ఉన్నారో చెప్పడం సాధ్యం కాకపోయినా, శిథిలాలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) పూర్తిగా ధ్వంసమైన కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని.. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం 14 కిలోమీటర వద్ద టన్నెల్‌లో ఉండగా, దాదాపు 500 మీటర్ల మేర మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో మూసుకుపోయిందని అన్నారు. ఇది సహాయక చర్యలకు ప్రధాన అవరోధంగా మారిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శిథిలాలను తొలగించడానికి లోపలికి ప్రవేశించడానికి రైల్వే ట్రాక్‌నే ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. కార్మికులు, యంత్ర పరికరాలను తరలించేందుకు ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసినా.. భారీ యంత్రాలను లోపలికి తీసుకెళ్లడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాదాపు 2 కిలోమీటర్ల మేర నీటిలో మునిగిపోయిందని, ఆ ప్రాంతంలో నీరు నడుము లోతు వరకు చేరడంతో సహాయక చర్యలు మరింత కష్టతరమయ్యాయని అధికారులు తెలిపారు.
Read Also: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా యువకుల చేరిక..
ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడంతో, లోపలికి సహాయక బృందాలను పంపడంలో మరింత జాప్యం ఏర్పడుతోంది. శిథిలాలను తొలగించడం ఒకటి అయితే, వాటిని బయటకు తీసుకురావడం మరో పెద్ద సవాలుగా మారిందని అధికారులు తెలిపారు. శిథిలాలు పూర్తిగా TBM (Tunnel Boring Machine)పై పడిపోవడంతో, దాన్ని పూర్తిగా కట్ చేయకపోతే సహాయక చర్యలు ముందుకు సాగవని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులను గమనిస్తే, మొత్తం శిథిలాలను తొలగించడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సహాయక బృందాలు శిథిలాలను తొలగించే ప్రక్రియలో నిమగ్నమై ఉండగా, మరిన్ని ప్రత్యేక యంత్రాలను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. కానీ, ప్రమాద స్థలంలోని సంక్లిష్ట పరిస్థితులు సహాయక చర్యలను మరింత ఆలస్యం చేస్తున్నాయి.