India won the super over against Sri Lanka: పల్లెకెలె వేదికగా మంగళవారం రాత్రి శ్రీలంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరిదైన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ముందుగా మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్‌కు శ్రీలంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తీక్షణ వేసిన తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. పొట్టి సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇక శ్రీలంక, భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి ఆరంభం అవుతుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శుభ్‌మన్ గిల్ (39; 37 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. జైస్వాల్ (10), శాంసన్ (0), రింకూ (1), సూర్యకుమార్ (8), దూబే (13) విఫలమయ్యారు. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ను పరాగ్ (26), సుందర్ (25) ఆదుకున్నారు. లంక బౌలర్లు తీక్షణ (3/28), హసరంగ (2/29) చెలరేగారు.
స్వల్ప ఛేదనలో నిశాంక (26), కుశాల్ మెండిస్ (43), కుశాల్ పెరీరా (46) రాణించడంతో లంక సునాయాస విజయం సాధించేలా కనిపించింది. అయితే చివరి 5 ఓవర్లలో తడబడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. లంక చివరి 5 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా.. 16వ ఓవర్‌లో కుశాల్ మెండిస్‌ను బిష్ణోయ్ అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో హసరంగ (3), అసలంక (0)లను సుందర్ ఔట్ చేయడంతో లంక ఒత్తిడిలో పడింది. 18వ ఓవర్లో ఖలీల్ 12 పరుగులు (అయిదు వైడ్లు) ఇవ్వడంతో సమీకరణం 2 ఓవర్లలో 9గా మారింది. ఆశల్లేని స్థితిలో పార్ట్‌టైమ్ స్పిన్నర్లయిన రింకు (2/3), సూర్యకుమార్ (2/5) సంచలన బౌలింగ్‌తో భారత జట్టుకు విజయాన్ని అందించారు.