Hong Kong Model: హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ (28) అత్యంత పాశవికంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫ్రిజ్‌లో కాళ్లు కనిపించగా.. తల, మొండెం, చేతుల కోసం పోలీసులు వెతికారు. డాగ్ స్క్వాడ్, డ్రోన్లతోపాటు డ్రైనేజీలో కూడా వెతికారు. ఈ క్రమంలో మానవ అవశేషాలు ఉన్న రెండు సూప్ కుండలను హత్య చేసిన ఇంట్లో పోలీసులు కనుగొన్నారు. వాటిల్లోని ఒక కుండలో హత్యకు గురైన మోడల్ తల కనుగొన్నట్లు హాంకాంగ్ పోలీసులు తెలిపారు. క్యారెట్, ముల్లంగితో తయారు చేసిన సూప్ కుండ నిండుగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సూపరింటెండెంట్ అలాన్ చుంగ్ అన్నారు. ఆ కుండలోని ద్రవంపైన తేలుతున్న తల కనిపించింది. తలపై చర్మంతోపాటు, మాంసం పూర్తిగా తొలగించి ఉంది. చూడటానికి పుర్రెలా ఉంది. సూప్‌లో ఇతర మాంసం ముక్కలు కూడా ఉన్నాయి. అవి మానవ మాంసం అవశేషాలుగా గుర్తించామని ఆయన వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్టులో పుర్రె వెనుక భాగంలో రంద్రం ఉన్నట్లు తెలిసింది. నిందితులు కారులో దాడికి పాల్పడి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ గత ఫిబ్రవరి 21 నుంచి కనబడటం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత తై పో జిల్లాలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలను పోలీసులు కనుగొన్నారు. అదే ఇంట్లో ఎలక్ట్రిక్ రంపం, మాంసం స్లైసర్, దుస్తులు, మోడల్ ఐడీకార్డులతో సహా ఇతర వస్తువులను పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో చోయ్ మాజీ భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్ ఉన్నారు. ఇక చోయ్ మాజీ అత్త అయిన జెన్నీ లీ సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించింది. వీరు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. సోమవారం వీరికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మోడల్ అబ్బి చోయ్ ఆస్తులపై కన్నేసి, ఆమె మాజీ భర్త ఈ హత్యకు కుట్రపన్నినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
Read Also: Sathvik Suicide: సాత్విక్ సూసైడ్.. వైరల్ అవుతున్న నాగచైతన్య స్పీచ్
పోలీసుల ప్రకారం.. చోయ్ తన మాజీ భర్త, అతని కుటుంబంతో పది మిలియన్ల హాంకాంగ్ డాలర్ల విలువైన విలాసవంతమైన ఆస్తి వివాదాలలో చిక్కుకుంది. కొంతమంది చోయ్ తన ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే విధానం పట్ల అసంతృప్తిగా ఉన్నారని పేర్కొంది.చోయ్‌కి మూడు నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారని ఆమె స్నేహితుడు బెర్నార్డ్ చెంగ్ తెలిపారు. అలెక్స్ క్వాంగ్ పెద్ద పిల్లలు ఇద్దరికి తండ్రి, వారు ఇప్పుడు చోయ్ తల్లి వద్ద ఉంటున్నారు. ఈ కేసులో మాజీ భర్త, అత్తమామలు అరెస్టయ్యారు. 28 ఏళ్ల మాజీ భర్త, అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్‌లపై సోమవారం హత్యా నేరం మోపబడి జీవిత ఖైదు విధించబడింది. మోడల్ మాజీ అత్త, జెన్నీ లీ, సాక్ష్యాలను నాశనం చేయడం ద్వారా న్యాయ మార్గాన్ని వక్రీకరించినట్లు అభియోగాలు మోపారు. కౌలూన్‌లోని ఒక ఉన్నతస్థాయి ఫ్లాట్‌లో నివసిస్తున్న అలెక్స్, శనివారం పడవలో నగరం నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అరెస్టు చేసినప్పుడు మిలియన్ డాలర్ల విలువైన భారీ మొత్తంలో నగదు, గడియారాలు దొరికాయి. చోయ్ మాజీ మామతో సంబంధం ఉన్న ఐదో అనుమానితుడిని ఆదివారం నేరస్థులకు సహాయం చేశారనే అనుమానంతో అరెస్టు చేశారు.