Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..

  • పెళ్లి వద్దని కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ..
  • పోలీస్ విచారణలో సంచలన విషయం చెప్పిన సియా గోయల్..
  • కేతన్ అగర్వాల్ హత్య కేసులో వేగం పెంచిన పోలీసులు..
Ketan Murder Case

Ketan Murder Case

Ketan Agarwal murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. నిందితురాలు సియా విచారణలో సంచలన విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పెళ్లి వద్దని కుటుంబానికి చెప్పడం కన్నా తనకు కాబోయే భర్తను హత్య చేయడమే సులభం అనిపించింది’’ అని పోలీసులతో సియా చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లిన సియా, తన లవర్ చేతన్ చౌదరితో కలిసి లోయలోకి తోసి హత్య చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు దర్యాప్తు కోసం పూణే, లోనావాలా పోలీసులతో కలిసి మొత్తం 6 ప్రత్యేక టీమ్‌లు విచారణ చేస్తున్నాయి. సియా, చేతన్‌ల జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలను విచారణ అధికారులు రాబడుతున్నారు. సియా తల్లిదండ్రులు, సోదరుడు సహిల్ గోయల్‌ను కూడా పోలీసులు పలుమార్లు విచారించారు. తన సోదరి సియాకు, చేతన్‌కు గతేడాది దీపావళి వేడుకల్లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైనట్లు సహిల్ పోలీసులకు తెలిపారు.

దర్యాప్తులో ఈ ఏడాది జనవరి నుంచి కేతన్‌ను చంపే వారకు సియా-చేతన్ మధ్య 2000లకు పైగా ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇద్దరూ 238 గంటల పాటు మాట్లాడుకున్నారు. హత్యకు ముందు, తర్వాత ఇద్దరు తమ మొబైళ్ల నుంచి చాట్ హిస్టరీ డిలీట్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్‌కు పంపించారు. ఇదిలా ఉంటే, సియాకు చేతన్ కేవలం ఒక స్నేహితుడనే తెలుసని సియా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ వివాహాన్ని కుదిర్చిన మధ్యవర్తుల్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు.