NTV Telugu Site icon

ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లలో బంగారం దాచిపెట్టిన కేటుగాళ్లు

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా 24 క్యారెట్ల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 6 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేటుగాళ్లు సినీ ఫక్కీలో బంగారాన్ని తరలించే యత్నం చేశారు. దుబాయ్ నుంచి లగేజీ బ్యాగులో మోసుకొని వచ్చిన సెల్‌ఫోన్‌లలో బంగారాన్ని దాచి దర్జాగా తప్పించుకోవాలని చూశారు. బంగారాన్ని కరిగించి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ బ్యాటరీలుగా తయారు చేసి కేటుగాళ్లు అందులో దాచిపెట్టారు.

Read Also: వైర‌ల్‌: ఒకే చెట్టుకు 40 ర‌కాల పండ్లు

అయితే కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి వీరి లగేజ్ బ్యాగ్‌ను స్కానింగ్ నిర్వహించగా అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు వారు గుర్తించారు. వారి లగేజ్ బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా సెల్ ఫోన్లు బయటపడ్డాయి. ఇన్ని సెల్ ఫోన్‌లు ఎందుకు తెస్తున్నారంటూ అధికారులు ప్రశ్నించగా.. కేటుగాళ్లు పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో కస్టమ్స్ అధికారులు తమదైన స్టైలులో విచారణ చేయగా… ల్యాప్‌టాప్, సెల్ ఫోన్స్ ముసుగులో అక్రమ బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న 10 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.