NTV Telugu Site icon

Floods: హిమాచల్‌ వరదల్లో 6గురు మృతి.. వందల సంఖ్యలో మూగజీవాల మృత్యువాత

Himachal Pradesh

Himachal Pradesh

Heavy Floods in Himachalpradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఆరుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. మొత్తం 303 జంతువులు చనిపోయాయని పేర్కొన్నారు. వర్షాల వల్ల రాష్ట్రంలో రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల వల్ల రెండు జాతీయ రహదారులు సహా 124 రోడ్లు దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. మండీలోని 7వ మైలు వద్ద చండీగఢ్-మనాలి హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Also Read: Price Hike: టమోటాలతో పాటు వాటి ధరలు కూడా పెరిగాయి.. ఎంత పెరిగాయో తెలుసా..!

ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల మండి-కుల జాతీయ రహదారిని పోలీసులు మూసేశారు. మండీ-జోగిందర్ నగర్ హైవే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా స్థానిక పోలీసులు ఆదివారం దిగ్బంధించారు. రాష్ట్రంలోని మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికి పైగా చిక్కుకుపోయారు. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మండి జిల్లా పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పధార్ సంజీవ్ సూద్ తెలిపారు. వర్షాకాల ఏర్పాట్లపై చర్చించేందుకు జూన్ 21న సంబంధిత శాఖలు, డ్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించామని ఓంకార్ చంద్ శర్మ తెలిపారు.

 

Also Read: PM Modi: రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని

రాష్ట్రంలో గత 3 రోజులుగా రుతుపవనాల వల్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం గురించి సమాచారం అందుతోందని ఓంకార్ చంద్ శర్మ చెప్పారు. మొత్తం 151 డీటీఆర్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఆరు నీటి సరఫరా పథకాలు కూడా ప్రభావితమయ్యాయన్నారు. ప్రతికూల విపత్తు పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రం జారీ చేసిన ప్రోటోకాల్‌లు, హెచ్చరికలను ప్రజలు పాటించాలని శర్మ కోరారు.

మండి-పండోహ్ ప్రాంతంలో ఆదివారం నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌గా ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. మండి-పరాశర్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయని, అక్కడ చిక్కుకుపోయిన వారిని రక్షించామని అధికారి తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్ అధికారులను అనేక ప్రాంతాలకు తరలించామని ఓంకార్ చంద్ శర్మ చెప్పారు. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు అలర్ట్‌ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.