Site icon NTV Telugu

Sri Rama Navami : పట్టు చీరలో శ్రీరామ నామం.. నేతన్న శ్రద్ధార్చన

Veldi Hari Prasad

Veldi Hari Prasad

భక్తి, కళ, నైపుణ్యానికి మేళవింపు అంటే సిరిసిల్ల చేనేతకారుల గొప్పతనం గుర్తుకు వస్తుంది. ఆ సంప్రదాయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తూ, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కల్యాణానికి ఒక అరుదైన పట్టు చీరను రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. ఈ చీరకు ప్రత్యేకత ఏమిటంటే – ఇది కేవలం పట్టు చీర మాత్రమే కాదు, ఇది భక్తి రూపంలో ఓ కళాత్మక కానుక. సీతమ్మకు అర్పించే ఈ బంగారు పట్టు చీరను హరిప్రసాద్ చేతి మగ్గంపై నేస్తూ పూర్తి 10 రోజులు శ్రమించాడు. చీర కొంగులో భద్రాచల రామాలయం మూలవిరాట్ దేవతామూర్తులు ప్రతిరూపంగా కనిపించేలా నెయ్యడం విశేషం.

చీర దిగువ భాగంలో శంకుహచక్ర నామాలు, హనుమంతుడు గరత్మంతుడు వచ్చేలా అద్భుతమైన డిజైన్ చేసాడు. అంతేకాకుండా “శ్రీరామ రామ రామేతి…” అనే పవిత్ర శ్లోకాన్ని 51 సార్లు చీరపై నేయడం ద్వారా ఆధ్యాత్మికతను అందులో మేళవించాడు.

ఈ చీర తయారీలో వన్ గ్రామ్ గోల్డ్ జరి పట్టు దారంను ఉపయోగించి, 7 గజాల చీర 800 గ్రాముల బరువుతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇది కేవలం నేతలందమైన చీర కాదు, భక్తితో నిండి, దేవతలకు అర్పించదగిన పవిత్ర కానుక. ప్రతి ఏడూ ఇలా పట్టు వస్త్రాలు నేస్తున్న హరిప్రసాద్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలనే అభిలాష అతనికి ఉంది. ఆయన్ని పలువురు ప్రశంసలు కురిపిస్తున్న ఈ తరుణంలో, ఈ అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలి, అలాగే ప్రతి ఏడూ శ్రీరామనవమి సందర్భంగా సిరిసిల్ల నేతన్నలకే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాడు.

గత మూడు సంవత్సరాలుగా ఇదే విధంగా సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేస్తున్న హరిప్రసాద్‌కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. అతని నైపుణ్యం, భక్తి, కళాత్మకతకు ఇది సజీవ సాక్ష్యం.

Sekhar Basha: హైదరాబాద్‌లో “HE టీమ్స్” ఏర్పాటు చేయాలి!

Exit mobile version