సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ రంగంలోనూ విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు.
రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సోలార్ రంగంలోకి అడుగుపెట్టి కమర్షియల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అధ్యయనం చేయాలని, వీలైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు(జాయింట్ వెంచర్)లు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై త్వరలోనే అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. అదే సమయంలో సింగరేణి కాలరీస్ మొదటి దశలో నిర్దేశించుకున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో మిగిలి ఉన్న 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరు లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి సోలార్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కాలువలపైనా ప్లాంట్ల ఏర్పాటు దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
రెండో దశలో కంపెనీవ్యాప్తంగా 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడుతున్నట్లు డైరెక్టర్(ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు వివరించగా.. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ సూచించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే సంస్థ విద్యుత్ అవసరాలను సోలార్ ప్లాంట్ల ద్వారానే తీర్చుకోగలుగుతామని.. తద్వారా తొలి జీరో ఎనర్జీ బొగ్గు కంపెనీగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోలార్ ప్లాంట్ల పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 12 శాతం ఇంధన అవసరాలను సింగరేణి థర్మల్ ప్లాంట్ ద్వారా తీర్చగలుగుతున్నామని, ఈ 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అవరణలో 700 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎండీ అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి సకాలంలో ఈ ప్లాంట్ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లతో 852 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని.. 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 60521 మిలియన్ యూనిట్ల విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేయడం జరిగిందని అధికారులు వివరించారు.
