Site icon NTV Telugu

Silicon Valley Bank: సిలికాన్‌ ప్రకంపనలు.. లక్ష ఉద్యోగాలకు ముప్పు, స్టార్టప్‌లలో ఆందోళన

Silicon Valley Bank

Silicon Valley Bank

Silicon Valley Bank: డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం దివాళా తీసి సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ప్రభావం చాలా దేశాలపై పడుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్ వైఫల్యంవల్ల ఇందులో డిపాజిట్‌ చేసిన 10,000 చిన్న వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు రాబోయే 30 రోజుల్లో జీతాలు ఇవ్వలేవని, మూతబడే ప్రమాదమూ ఉందని.. లక్ష మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంటూ అమెరికా ప్రభుత్వానికి అంకుర సంస్థల ఇంక్యుబేటర్‌ వై కాంబినేటర్‌ పిటిషన్‌ సమర్పించింది. తమ పరిధిలోని అంకుర సంస్థల్లో మూడో వంతు కేవలం ఎస్‌వీబీ ఖాతాలనే కలిగి ఉన్నాయని తెలిపింది. ఈ పిటిషన్‌పై అంకుర సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలకు చెందిన 3,500 మంది సీఈవోలు, 2 లక్షల మంది ఉద్యోగులు సంతకాలు చేశారు. ఈ సంస్థ భారత్‌లోని 200 స్టార్టప్‌లతో పాటు అమెరికాలో వేలాది స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వై కాంబినేటర్‌ సంస్థ సీఈవో, ప్రెసిడెంట్‌ గార్రీ టాన్‌ అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్‌ యెల్లెన్‌, ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

Read Also: Pakistan: పాకిస్థాన్‌లో 37 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు వాయిదా

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను భారీగా పెంచడమే సిలికాన్ వ్యాలీ బ్యాంగ్ కుప్పకూలడానికి కారణమని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు పెరగడంవల్ల ఎస్‌వీబీ బాండ్లు, తనఖా ఉన్న సెక్యూరిటీల మార్కెట్‌ విలువ పడిపోయిందని, అదే ప్రస్తుత స్థితికి కారణమని విశ్లేషించారు. బ్యాంకు ఆస్తులను నియంత్రణ సంస్థలు శుక్రవారం స్తంభింపజేశాయి. అమెరికా సర్కారు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు ఉద్దీపన ప్రకటించడం లేదని.. కానీ డిపాజిటర్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుందని జానెట్‌ యెల్లెన్ ఆదివారం ప్రకటించారు. దాదాపు 15 ఏళ్ల క్రితం బ్యాంకులకు ఉద్దీపనలు ప్రకటించి ఆదుకున్న పరిస్థితికి, ప్రస్తుత పరిస్థితికి పోలికే లేదన్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకును ఆదుకునే ఉద్దేశం లేదన్నారు. ఈ ప్రభావం ఇతర బ్యాంకులపై పడదనే భరోసాను ఇచ్చారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా నేపథ్యంలో అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగింది. బ్యాంకుల డిపాజిటర్లకు భరోసా కల్పించేందుకు ప్రత్యేక నిధినిఏర్పాటు చేయాలని ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ), ది ఫెడరల్‌ రిజర్వు యోచిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version