Godavari: సీలేరు జలాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాల పరిధిలో రబీ వరి పంటకు జీవం పోస్తున్నాయి. సీలేరు జలాశయం నుంచి ప్రతి రోజు 7 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. దీని వలన గోదావరి డెల్టాలోని వరి పంటలు నీటి కష్టాల నుంచి గట్టు ఎక్కుతున్నాయి. రబీలో పూర్తి ఆయకట్టుకు గోదావరి జలాలు అందిస్తామని ఆదిలో ఇరిగేషన్ అధికారులు ప్రకటించినా తర్వాత ఈ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో సీలేరు ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన జలాలే పంటను ఆదుకుంటున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని మూడు డెల్టాల్లో 8 లక్షల 96 వేల 507 ఎకరాల్లోని వరి పొలాలకు ప్రస్తుతం 8 వేల 560 క్యూసెక్కుల సాగునీటిని అందిస్తున్నారు.
Read Also: Bangladesh: బంగ్లా స్కూల్ బుక్స్ నుంచి “జాతిపిత” చరిత్ర తొలగింపు, భారత్ పాత్ర తగ్గింపు..
ఇక, ముందుగా సాగు చేసిన వరి పంట ప్రస్తుతం పిలకలు తొడిగే దశకు చేరుకుంది. వారం రోజులుగా సీలేరు నుంచి గోదావరికి వస్తున్న నీటితోనే.. డెల్టాలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం అవసరాల మేరకు సాగునీరు అందించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో సీలేరు నుంచి 7 వేల క్యూసెక్కులు నీరు గోదావరిలోకి వచ్చి చేరుతున్నాయి. రైతులకు సాగునీటి అవసరాలు పెరగడంతో సీలేరు ప్రాజెక్టు విద్యుత్త్ ఉత్పత్తి ద్వారా కొంత విడుదల చేస్తుండగా.. నేరుగా మరి కొన్ని జలాలను రిలీజ్ చేస్తున్నారు. క్రమంగా సీలేరు నుంచి గోదావరి డెల్టాకు సాగు నీటిని అందజేస్తున్నారు. గోదావరి సహజ జలాలతో పాటు సీలేరు జలాలే చాలా వరకు వరి పంటను గట్టెక్కిస్తున్నాయి.