Maha Shivratri 2025: హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసంలో క్రిష్ణ పక్ష చతుర్దశి తిధినాడు మహా శివరాత్రి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ రోజు లింగ రూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు. అంతేకాకుండా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పేర్కొనబడింది. హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి నెలా శివరాత్రి వస్తుంది. అయితే, మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజు పూర్తిగా పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం, శివపార్వతుల కలయిక ఈ రోజున జరిగిందని చెబుతారు. అంతేకాకుండా, లింగోద్భవం కూడా ఇదే రోజు చోటుచేసుకుందనే విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజు శివభక్తులు విశేషమైన పూజలు నిర్వహిస్తారు.
Read Also: MLC Elections 2025: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం!
మహా శివరాత్రి రోజున జాగరణ:
ఈ పవిత్రమైన రోజున శివభక్తులు రాత్రంతా మేల్కొని ఉంటారు. జాగరణ చేయడం వల్ల భక్తి శ్రద్ధలు పెరిగి, శాంతి, ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శివుని స్మరణ చేసుకుంటూ జాగరణ ఉండటం వలన మనిషిలో సహజ శక్తులు పెరుగుతాయని, వెన్నెముక నిటారుగా ఉంచుకుని శివనామస్మరణ చేస్తే ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. శివరాత్రి రాత్రి వేళ మేల్కొని, వెన్నెముకను నిటారుగా ఉంచుకుని ధ్యానం చేయడం వల్ల యోగంతో పాటు అదనపు శక్తులను పొందుతారని నమ్మకం. మహా శివరాత్రి రోజున జాగరణ వల్ల భక్తుడు కామం, క్రోధం, అసూయ, ద్వేషం వంటి చెడు గుణాల నుండి విముక్తి పొంది.. శాంతి, ఐశ్వర్యాన్ని పొందుతాడని నమ్మకం.
Read Also: IND vs PAK: భారత్, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండి!
శివరాత్రి రోజున ఉపవాసం:
పురాణాల ప్రకారం, ఓ రోజు పార్వతీ దేవి శివుని ఉద్దేశించి శివరాత్రి ప్రాముఖ్యతను ప్రశ్నించగా.. శివుడు ఈ రోజు తనకు ఎంతో ప్రీతికరమైనదని, భక్తులు ఉపవాసం ఉంటూ, జాగరణ పాటిస్తే వారికి అనేకమైన శుభఫలితాలు లభిస్తాయని తెలిపారు. శివరాత్రి రోజున భక్తులు నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి.. రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనేతో అభిషేకం చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు. కొన్ని పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున ఉపవాసం పాటించి, పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజలు చేస్తే భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈరోజున జాగరణ ఉండటం వల్ల శివుడు తన భక్తులను నరక భయాల నుంచి కాపాడుతాడని విశ్వసిస్తారు. ఈ ఒక్క రోజు ఉపవాసం, జాగరణ పాటిస్తే ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేకుండా శివుని కృపను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మొత్తానికి మహా శివరాత్రి హిందువుల ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన పండుగ. శివుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించే భక్తులు ఉపవాసంతో, జాగరణతో, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి.. శివుని ఆశీస్సులు పొందుతారు.