Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..

Screenshot 2026 08 20 064716

Screenshot 2026 08 20 064716

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు జలసమాధి అయ్యారు. మృతులందరూ బలవంతపూర్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంలో బలవంతపూర్ వాసి రాజు (35), ఆయన భార్య భాగ్య (22), వారి ఐదేళ్ల కుమారుడు నియాన్ష్, మూడేళ్ల కుమార్తె శాన్విక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటలో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఇటీవల జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి రాజు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. వేడుక ముగించుకుని రాత్రి సమయంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అర్థరాత్రి దాటినా వారు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాజు , ఆయన భార్య భాగ్య ఫోన్లకు వరుసగా కాల్స్ చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అని రావడంతో అనుమానం వచ్చిన బంధువులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అప్పనపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఒక కారు మునిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. వాహనం లోపల పరిశీలించగా నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకట్లో డ్రైవింగ్ చేస్తుండగా అదుపు తప్పి కారు నేరుగా బావిలోకి దూసుకెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారి పిల్లలు  ప్రాణాలు కోల్పోవడంతో బలవంతపూర్ , అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. చిన్నపిల్లల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదం జరిగిన తీరుపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.