తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. యూరియా కోసం రాత్రింబవళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదునుకు పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర రైతులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం ప్రదర్శించారు. క్యూ లైన్లో నిలబడిన రైతులపై మరికల్ ఎస్ ఐ రాము జులుం ప్రదర్శించాడు. యూరియా కోసం క్యూ లైన్లలో నిలిచిన రైతులపై ఎస్ఐ చేయి చేసుకున్నాడు. యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టాడు. ఈ ఘటనతో రైతు షాక్ కు గురయ్యాడు. రైతులు, రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని.. యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.