Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!

  • వెస్టిండీస్‌పై తొలి టీ20
  • భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం
  • శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా
  • అంతర్జాతీయ టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ తన తొలి సెంచరీ నమోదు..
Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ శతకంతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు” అందుకున్నాడు. 43 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో తన తొలి సెంచరీని నమోదు చేసిన అయ్యర్.. మ్యాచ్ తర్వాత తన అనుభవాలను పంచుకున్నాడు.

జపాన్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన తమకు మ్యాచ్‌కు ముందు తీవ్ర అలసటగా అనిపించిందని శ్రేయస్ తెలిపాడు. ‘‘సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు. ప్రతిరోజూ ఇలాగే నిద్రలేవాలని అనిపిస్తోంది. అయితే ప్రయాణ అలసటను సాకుగా చూపించకూడదని నిర్ణయించుకున్నాం. సాధారణంగానే మైదానంలోకి వచ్చి మా ఆట ఆడాం’’ అని అన్నారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడం తమకు బాగా కలిసొచ్చిందని అన్నాడు. పిచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని ప్రణాళికలను అమలు చేయడంపై దృష్టి పెట్టామని వివరించాడు. భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరును తాము చూశామని, టీ20ల్లో వెస్టిండీస్ ఎంత ప్రమాదకరమైన జట్టో తెలుసని పేర్కొన్నాడు.

తన తొలి టీ20 శతకంపై అయ్యర్ భావోద్వేగంగా స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల్లో నా తొలి సెంచరీ గురించి ఆలోచిస్తున్న సమయంలోనే అది సాధించాను. కలలు నిజమవుతాయని మరోసారి రుజువైంది. సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. కానీ జట్టు గెలిచినప్పుడు వచ్చే ఆనందం మాత్రం వేరని అన్నాడు. తనదైన రోజు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని జట్టు విజయం కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఇతర బ్యాటర్లు జట్టును విజయతీరాలకు చేర్చారని, ఈసారి తన వంతు వచ్చిందని తెలిపాడు. మొత్తంగా ఇది సమష్టి ప్రదర్శన అని పేర్కొన్నాడు.

ఇదే మైండ్‌సెట్‌తో ముందుకు సాగితే టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా భారత్ మారుతుందని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని చెప్పాడు. అలాగే యువ ఆటగాడు నమన్ ధీర్ బౌలింగ్‌ను కూడా శ్రేయస్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. కీలక సమయాల్లో బౌలింగ్ చేయాలనే అతని ఆసక్తి, పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసిన తీరు తనను ఆకట్టుకున్నాయని చెప్పాడు. పిచ్‌లో టర్న్‌ను గుర్తించి దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు.

సుదీర్ఘ విమాన ప్రయాణం కారణంగా తనతో పాటు అక్షర్ పటేల్ కూడా అలసిపోయాడని అయ్యర్ సరదాగా చెప్పాడు. ‘నాకు ఇప్పటికే నిద్ర వస్తోంది. అక్షర్ కళ్లు కూడా ఎర్రబడ్డాయి. జట్టులోని అందరూ ప్రయాణం వల్ల అలసిపోయి ఉంటారు. ఈ రాత్రి హాయిగా నిద్రపోతాం అని సరదాగా చెప్పాడు. తొలి టీ20లో భారీ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరగనుంది.