Shreyas Iyer: జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కాబోతున్నాడు. ఈ సిరీస్‌కు ఆయనకు ఇప్పటివరకు బీసీసీఐ నుంచి క్లియరెన్స్ లభించలేదని సమాచారం. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ బ్యాటింగ్ చేయగలిగినా, మైదానంలో ఫీల్డింగ్ చేసేంత శారీరక బలం ఇంకా రాలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ నెలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టేందుకు డైవ్ చేయబోయి శ్రేయస్ అయ్యర్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ తర్వాత సిడ్నీలో చేసిన స్కాన్లలో అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు గుర్తించగా.. ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చి ఐసీయూలో చికిత్స అందించారు. రక్తస్రావాన్ని నియంత్రించేందుకు స్వల్ప శస్త్రచికిత్స కూడా చేశారు.
అందించిన సమాచారం ప్రకారం గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దాదాపు 6 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కండరాల బలం తగ్గిపోవడం ఆయన రికవరీలో కీలక సమస్యగా మారిందని సమాచారం. అయితే శ్రేయస్ రికవరీ ప్రణాళిక ప్రకారం సాగితే.. జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశముందని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారత జట్టుతో కలిసి వడోదరలో చేరతారని భావించారు. అయితే ఇది పూర్తిగా శ్రేయస్ శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
Vaishnavi : జ్ఞాపకాలే మిగిలాయి.. వైష్ణవి ఎమోషనల్ పోస్ట్
ఈ విషయంలో బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ ఈ వారం స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం మంచి ఫిట్‌నెస్‌లో ఉన్నాడు. కానీ 50 ఓవర్ల మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే సామర్థ్యాన్ని ముందుగా అంచనా వేయాలి. దానిపైనే విజయ్ హజారే ట్రోఫీతో పాటు వన్డే సిరీస్‌లో ఆయన పాల్గొనడం ఆధారపడి ఉంటుంది అని తెలిపాయి. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌ను భారత, ఆస్ట్రేలియా వైద్య నిపుణులు కలిసి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే ఆయనను మైదానంలోకి దించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
