NTV Telugu Site icon

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్ రావు విచారణ..

Phone Tapping Sharavan

Phone Tapping Sharavan

Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) అధికారులు 11 గంటల పాటు విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చి ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

శ్రవణ్ రావు వద్ద నుండి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లను సిట్ అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వాటిలోని కాల్ లాగ్స్‌, మెసేజ్‌లు, వాట్సాప్ చాట్స్ తదితర ఆధారాలను బట్టి ప్రాథమికంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌ కోసం ఎవరెవరి నంబర్లు ఇచ్చారనే దానిపై శ్రవణ్‌ను ప్రత్యేకంగా విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరిన్ని విచారణలు జరిపే అవకాశముంది.

వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు నేపథ్యంగా జరిగిందని అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావు ఎవరి ఆదేశాలతో ఈ పనుల్లో పాల్గొన్నారన్న దానిపై కూడా అధికారులు ఆరా తీశారు. ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలపై సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు సేకరించి పంపినట్లు సమాచారం. ఆ నివేదికలు ఎవరి ఆదేశాలతో పంపించబడ్డాయో తెలుసుకునేందుకు సిట్ కృషి చేస్తోంది.

శ్రవణ్ రావు మాజీ ఇంటెలిజెన్స్ శాఖ (SIB) అధికారులు, ఉద్యోగులతో సంబంధాల్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆ సంబంధాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావు మాధ్యమంగా, కొన్ని కీలక రాజకీయ నాయకులకు సమాచారం చేరినట్లు శంకించబడుతోంది. ఆయన ఒక మీడియేటర్ పాత్ర పోషించారనే ఆరోపణలు ప్రాథమిక విచారణలో వచ్చినట్లు సమాచారం.

సిట్ అధికారులు ఈ విచారణతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. అందువల్ల ఆయనను మరో మూడు రోజుల్లో మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తుది నివేదిక సిద్ధమయ్యే వరకు మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.