NTV Telugu Site icon

Palnadu: తేరుకుంటున్న పల్నాడు.. తెరుచుకుంటున్న చిరు వ్యాపారాలు!

Ap Police

Ap Police

144 Section in Palnadu: రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల పట్టణంలో పోలీసులు 1500 మంది బలగాలను మోహరింపజేసి.. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.

Also Read: AP EAPCET: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్‌.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ!

కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లోనూ భారీగా పోలీసులు ఉన్నారు. నరసరావుపేట, మాచర్లలో జరిగిన అల్లర్ల ఘటనల్లో కేసులు నమోదు చేశామని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. 144 సెక్షన్‌ అమలు చేశామని, ఎవరూ గుంపులుగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. నాయకులు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతూ.. తమ అనుచరులను రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు చెలరేగుతున్నాయని గుర్తించిన పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు.

 

 

Show comments