Shoaib Akhtar: పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజు రోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా మాజీ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల వేడుక ఇప్పుడు తీవ్ర అంతర్జాతీయ సంచలనంగా మారింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ అంత్యక్రియలకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) అగ్రనేతలు, ఉగ్రవాదులు బహిరంగంగా హాజరుకావడం తీవ్ర కలకలం రేపుతోంది. షోయబ్ అక్తర్ పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ జూన్ 24న కన్నుమూశారు. ఇస్లామాబాద్‌లోని హెచ్-8 శ్మశానవాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో భారతదేశంలో 26/11 ముంబై దాడులు, గతేడాది పహల్గామ్ మారణకాండ వంటి ఘోరమైన ఉగ్రదాడుల వెనుక ఉన్న లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సైఫుల్లా కసూరి స్పష్టంగా కనిపించడం గమనార్హం. అతనితో పాటు లష్కరే తోయిబా రాజకీయ విభాగమైన ‘పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (PMML) అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహమాన్ సైతం ఈ వేడుకకు హాజరయ్యాడు. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాది హఫీజ్ సయీద్.. తన జమాత్-ఉద్-దవా (JuD), మిల్లీ ముస్లిం లీగ్ (MML) వంటి సంస్థలపై ఉన్న అంతర్జాతీయ, దేశీయ నిషేధాల నుంచి తప్పించుకోవడానికి ఈ పీఎమ్‌ఎమ్‌ఎల్ (PMML) అనే కొత్త రాజకీయ ముసుగును ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ 2024 పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది.
సైఫుల్లా కసూరి వంటి ప్రమాదకరమైన ఉగ్రవాదులు రాజధాని నగరంలో ఇలా బాహాటంగా తిరగడం, బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం, ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెటర్ ఇంటికి రావడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనతో మరోసారి పాకిస్థాన్ ద్వంద్వ ప్రపంచం ముందు బట్టబయలైంది. ఉగ్రవాదానికి స్పాన్సర్‌గా మారిన పాకిస్తాన్‌లో ఉగ్రమూకలకు అక్కడ ఎలాంటి ప్రభుత్వ, సైనిక రక్షణ ఉందో ఈ ఘటన నిరూపిస్తోంది. షోయబ్ అక్తర్ 2011లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, పాకిస్తాన్‌లో ప్రముఖ కామెంటేటర్‌గా యాక్టివ్‌గా ఉన్నాడు. గతంలో ఐపీఎల్‌కు కూడా కామెంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ అంత్యక్రియల్లో సైఫుల్లా కసూరి కనిపించడం భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే, ఏప్రిల్ 22, 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న దారుణ ఉగ్రదాడికి ఈ కసూరియే ప్రధాన సూత్రధారి అని భారత నిఘా వర్గాలు నమ్ముతున్నాయి. ఆ నరమేధానికి ప్రతీకారంగా భారత్ అత్యంత కఠినమైన చర్యలు చేపట్టింది. ఇరు దేశాల మధ్య ఉన్న ‘సింధు జలాల ఒప్పందాన్ని’ (Indus Waters Treaty) రద్దు చేయడమే కాకుండా, ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మురిద్కేలోని లష్కర్ ప్రధాన కార్యాలయంతో పాటు రావల్పిండి నుంచి సుక్కూర్ వరకు ఉన్న కీలక ఉగ్రవాద శిబిరాలను, వారికి సహకరిస్తున్న సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ జరిపిన ఆ విధ్వంసకర దాడులతో లష్కరే తోయిబా సహా ఇతర ఉగ్రవాద సంస్థలు గజగజలాడాయి. ఆ దెబ్బకు కోలుకోలేకపోయిన కసూరి, అప్పటి నుంచి భారతదేశంపై తీవ్ర విషం గక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చిన ఒక వీడియోలో.. భారత్‌కు భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఎక్కడా స్థానం లేకుండా చేస్తామని, సముద్ర మార్గం ద్వారా మరోసారి 26/11 తరహా దాడికి తెగబడతామంటూ కసూరి బహిరంగ హెచ్చరికలు జారీ చేశాడు. సింధు నది ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని మనసులో ఉంచుకుని, భారతదేశం ‘వాటర్ టెర్రరిజం’కు పాల్పడుతోందని ఆరోపించాడు. కశ్మీర్‌లో భారత్ పెడుతున్న ఒత్తిడికి ఇతర ప్రాంతాల్లో అల్లర్లతో సమాధానం చెప్తామని బెదిరించాడు. పాకిస్థాన్ క్రికెటర్‌కి ఉగ్రవాదులతో లింక్స్ ఏంటి? అదీ 26/11 ముంబై దాడులు, పహల్గామ్ సూత్రధారుతో సంబంధాలు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

