Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..

Shoaib Akhtar

Shoaib Akhtar

పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ధృవీకరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో అక్తర్ స్పందిస్తూ.. “నా ప్రియమైన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అల్లా చెంతకు చేరారని చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియల (నమాజ్-ఎ-జనాజా) సమయం, వేదికను త్వరలోనే తెలియజేస్తానని వెల్లడించారు. అయితే.. షాహిద్ అక్తర్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఈ విషాద వార్తను ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. షాహిద్ అక్తర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. హెచ్-8 శ్మశానవాటికలో అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతాయని, అభిమానులందరూ ఆయన కుటుంబం కోసం ప్రార్థించాలని కోరారు. ఈ వార్త తెలియగానే పలువురు మాజీ క్రికెటర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు షోయబ్ అక్తర్ కుటుంబానికి సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఐదేళ్ల క్రితమే అక్తర్ తన తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఇప్పుడు పెద్దన్నయ్య కూడా దూరమవ్వడంతో ఆయన కుటుంబంలో మరోసారి తీరని లోటు ఏర్పడింది.

×
×
Ad

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా షోయబ్ అక్తర్ ప్రపంచ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రముఖ క్రీడా విశ్లేషకుడిగా, పండిట్‌గా పలు మీడియా ఛానెళ్ల చర్చల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆయన విశ్లేషకుడిగా వ్యవహరించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులోని పరిపాలనా లోపాలను, ఆటగాళ్ల ప్రదర్శనలను ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా విమర్శిస్తూ, 1990ల నాటి వైభవాన్ని పాక్ జట్టు మళ్లీ ఎలా సాధించాలో సూచిస్తూ అక్తర్ ఎప్పుడూ గళం విప్పుతుంటారు. ఈ కష్టసమయంలో అక్తర్ కుటుంబానికి క్రీడాలోకం అండగా నిలిచింది.