Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!

Shoaib Akhtar

Shoaib Akhtar

Pakistan: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే, ఈసారి అతడు వార్తల్లోకి రావడానికి క్రికెట్ కారణం కాదు.. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అంత్యక్రియలు (జనాజా). ఈ అంత్యక్రియల వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (LeT), దానికి అనుబంధ రాజకీయ విభాగమైన ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (PMML) కు చెందిన పలువురు కీలక నేతలు, కార్యకర్తలు హాజరయ్యారనే వాదనలు వెలువడటం తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల ప్రకారం.. షాహిద్ అక్తర్ అంత్యక్రియల ప్రార్థనలు ఇస్లామాబాద్‌లోని హెచ్-8 (H-8) స్మశానవాటికలో జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఇనామ్-ఉర్-రెహమాన్‌తో పాటు పలువురు అనుమానిత వ్యక్తులు ఈ జనాజాలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలను పీఎమ్‌ఎమ్‌ఎల్ (PMML) అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలోనే షేర్ చేసినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు ఈ పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ రాజకీయ ముసుగుగా పనిచేస్తుందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అంతేకాకుండా, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీతో ఇనామ్-ఉర్-రెహమాన్ కలిసి ఉన్న కొన్ని పాత ఫోటోలను కూడా ఇప్పుడు నెటిజన్లు బయటకు తీసి వైరల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, షోయబ్ అక్తర్ సోదరుడి మృతి పట్ల పాకిస్థాన్ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ స్వయంగా షోయబ్ అక్తర్ నివాసానికి చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. షాహిద్ అక్తర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ కష్టసమయంలో అక్తర్ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించినట్లు నేషనల్ అసెంబ్లీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఓ అంతర్జాతీయ క్రికెటర్ కుటుంబ సభ్యుడి అంత్యక్రియల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు బహిరంగంగా కనిపించడం పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ల స్వేచ్ఛపై మళ్లీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాకిస్థాన్‌లోని కొన్ని నిషేధిత సంస్థలు వేర్వేరు పేర్లతో, రాజకీయ వేదికల ముసుగులో తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయనే అంతర్జాతీయ ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.