యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో మూగ్గురు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకడు ఆల్‌రౌండర్ శివమ్ దూబే. రెండు ఓవర్లు వేసిన దూబే.. 4 పరుగులు ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. 12 బంతుల్లో 10 డాట్ బాల్స్ ఉండటం విశేషం. 2024 టీ20 ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సహకారంతోనే తాను మెరుగ్గా రాణించగలిగానని దూబే చెప్పాడు. భారత జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుంచి మోర్కెల్ తన వెంట పడ్డాడని, అందుకే మెరుగైన ప్రదర్శన చేశానని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం శివమ్ దూబే మాట్లాడుతూ… ‘నేను భారత జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుంచి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ నా వెంట పడ్డాడు. నా బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. నాకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. వాటిని నేను అమలు చేశా. అలానే ఆఫ్ స్టంప్‌కు కాస్త వెలుపల ఉండే లైన్‌లో బౌలింగ్ చేయాలని, స్లో డెలివరీని మెరుగుపరచడానికి నా రన్నప్‌ను కొద్దిగా మార్చాడు. బౌలింగ్ జట్టుకు కీలకం అవుతుందని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఈరోజు బాగా బౌలింగ్ చేశా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది. మా బౌలింగ్ కోచ్ కూడా ఆనందంగా ఉన్నాడు’ అని తెలిపాడు.
Also Read: World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!
‘గత రెండు నెలలుగా నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. బాగా కష్టపడ్డాను. మిడిల్ ఓవర్లలో హిట్టింగ్ చేయడం నా బాధ్యత. గతంలో బౌలర్లు షార్ట్ బాల్స్‌తో నన్ను టార్గెట్ చేశారు. నా షాట్లను మెరుగుపర్చుకున్నాను. బంతిని బలంగా బాదేందుకు ఇష్టపడతా. అవసరం అనుకుంటే స్లోగా కూడా బ్యాటింగ్ చేస్తా. నేను బౌలింగ్ చేయాల్సి ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందే చెప్పారు. యూఏఈపై రాణించా. తరవాతి మ్యాచులలో తప్పకుండా బ్యాట్‌తో కూడా రాణిస్తా’ అని శివమ్ దూబే ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024లో చెన్నై తరపున రాణించడంతో దూబేకు మరలా జట్టులో చోటు దక్కింది. అప్పటినుంచి హిట్టింగ్ చేస్తూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.
