NTV Telugu Site icon

Maharashtra Next CM: ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎం కావడానికి ఈ 6 కారణాలను వివరించిన శివసేన!

Eknath Shinde

Eknath Shinde

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. శివసేన ఎమ్మెల్యేలు ఆదివారం బాంద్రాలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడ వారు శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్ షిండేను తిరిగి ఎన్నుకున్నారు. ఉదయ్ సామంత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏక్‌నాథ్ షిండేను మళ్లీ మహారాష్ట్ర సీఎంని చేయాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శివసేన అధికార ప్రతినిధి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ.. “మా కూటమి పెద్ద విజయం సాధించింది. ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎం కావాలని మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.” అని తెలిపారు.

ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎంకావడానికి శివసేన తెలిపిన 6 పెద్ద కారణాలు..

1) శివసేన (యూబీటీ)ని అదుపులో ఉంచుతారు : ఏకనాథ్ ముఖ్యమంత్రి కాకపోతే.. శివసేన(యూబీటీ) మెరుగుపడుతుంది. అధికారంలోకి రావడానికి బీజేపీ శివసేన పేరును, ఎన్నికల చిహ్నాన్ని ఉపయోగించిందని, సమయం వచ్చినప్పుడు దానిని పక్కన పెట్టిందని యూబీటీ ఆరోపిస్తుంది. ఉద్ధవ్ సేన, ఎంవీఏ మిత్రపక్షాలు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని బీజేపీ వర్సెస్ మహారాష్ట్ర అనే విధంగా మార్చడానికి ప్రయత్నిస్తాయి.

2) మరాఠీ గుర్తింపు బలపడుతుంది: మహాయుతి ఏకనాథ్ షిండేను సీఎంగా ఉంచడం ద్వారా మరాఠీ గుర్తింపును బలోపేతం చేయవచ్చు. ఈ నిర్ణయంతో మారాఠీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతారు. మరాఠీ గుర్తింపును గౌరవించాలనే బీజేపీ నిబద్ధతను మారాఠీలు గుర్తిస్తారు. పార్టీని గౌరవిస్తారు.

3) సుపరిపాలన కొనసాగింపు సందేశం: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల వల్లనే.. తాజా ఎన్నికల్లో మహాయుతికి భారీ సీట్లు వచ్చాయి. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొనసాగడంతో సుపరిపాలనలో మహాయుతి ఇమేజ్ మరింత బలపడుతుంది. దీంతో పాటు పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

4) మహారాష్ట్రలో కుల విభజనపై నిషేధం: షిండే కాంగ్రెస్‌ను నాశనం చేసిన మరాఠా నాయకుడు. మహాయుతికి ఓటు వేయమని మరాఠాలను ఒప్పించారు. కుల విభజన, అవిశ్వాసం ఇప్పటికీ మహారాష్ట్రలో సమస్యగా మారింది. మరాఠా ముఖ్యమంత్రిని కొనసాగించడం ద్వారా అన్ని కుల విభజన శక్తులు దూరంగా ఉంటాయి. మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్‌ను తారుమారు చేయకుండా సామాజిక, ఆర్థిక న్యాయం పొందేలా షిండే హామీ ఇచ్చారు.

5) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు: మహారాష్ట్ర అంతటా వచ్చే 2-3 సంవత్సరాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సీఎంని మార్చడంతో ప్రభుత్వ పనితీరుపై ప్రజానీకం పునరాలోచనలో పడుతుంది. కొత్త సీఎం వస్తే.. ప్రస్తుత విజయంతో వచ్చిన ఊపు పోతుంది. ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా మహాయుతి ఈ జోరును కొనసాగించవచ్చు. ఇది స్థానిక ఎన్నికల్లో కూడా లాభిస్తుంది.

6) జనాదరణ పొందిన వ్యక్తి.. నాయకత్వ సామర్థ్యం: ఎన్నికలకు ముందు.. నిర్వహించిన అన్ని సర్వేల్లో మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఏక్‌నాథ్ షిండే అని తేలింది. అన్ని కులాలు/ప్రాంతాల ప్రజలు ఏకనాథ్ షిండే పట్ల గౌరవం కలిగి ఉన్నారు. ఆయన నాయకత్వంలో మహాయుతి చాలా సాఫీగా కొనసాగింది. మూడు పార్టీల కూటమిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆయన తన నాయకత్వ పటిమను ప్రదర్శించారు. ఆయన నాయకత్వం లోక్‌సభ ఎన్నికల సమయంలో కనిపించిన బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్‌కు తెరపడింది.

 

 

Show comments