భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఓ ధావన్-సోఫీ వివాహ వేడుక ఫిబ్రవరి మూడో వారంలో ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాహ ఏర్పాట్లు మొదలైనట్టు సమాచారం. ఈ వివాహ వేడుకకు పలువురు క్రికెట్ ప్రముఖులు, గబ్బర్ సన్నిహితులు హాజరయ్యే అవకాశం ఉంది.
శిఖర్ ధావన్, సోఫీ షైన్ పరిచయం కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైంది. వీరిద్దరూ దుబాయ్‌లో మొదటిసారి కలుసుకుని స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో ఇద్దరి రిలేషన్‌షిప్ బయటపడింది. ఫైనల్ మ్యాచ్‌ను ధావన్-సోఫీ కలిసి వీక్షించారు. అప్పటినుంచి ఇద్దరు హాట్‌టాపిక్‌గా మారారు. వీరిద్దరూ ఏడాదికి పైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ధావన్ 2012లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి 2014లో జొరవర్ ధావన్ పుట్టాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట 2023లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత గబ్బర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చాడు.
సోఫీ షైన్ నేపథ్యం చాలా భిన్నమైంది. ఐర్లాండ్‌కు చెందిన ఆమె విద్యా రంగంలో మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. క్యాసిల్‌రాయ్ కాలేజ్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన సోఫీ.. లిమరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పొందారు. గతంలో ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేసిన సోఫీ.. ప్రస్తుతం అబుదాబీలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. క్రీడాకారులు సాధారణంగా సినీ లేదా సోషల్ మీడియా రంగానికి చెందిన వారిని వివాహం చేసుకునే సందర్భాలు ఎక్కువ. కానీ సోఫీ విషయంలో అది భిన్నం. అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్, కార్పొరేట్ కెరీర్‌తో పాటు సామాజిక సేవలపైనా ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉంది. ప్రస్తుతం ‘డా వన్ స్పోర్ట్స్’కు అనుబంధంగా ఉన్న శిఖర్ ధావన్ ఫౌండేషన్‌ను ఆమెనే నడిపిస్తోంది.
సోషల్ మీడియాలో కూడా సోఫీ షైన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను దాదాపు 3.41 లక్షల మంది ఫాలో అవుతున్నారు. గత కొంతకాలంగా టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది. పలుమార్లు క్రికెట్ మ్యాచ్‌లకు కలిసి హాజరైన ఈ జంటపై అప్పట్లో ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఇటీవల శిఖర్ స్వయంగా తన రిలేషన్‌షిప్‌ను బహిరంగంగా ప్రకటించాడు. చివరకు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. ఇక గబ్బర్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు.