ఆహాలో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు డాన్స్ ఐకాన్ షో ప్రసారం అవుతోంది. మొత్తం పన్నెండు గ్రూపులను టాలీవుడ్ కు చెందిన టాప్ 6 ప్రొడ్యూసర్స్ కొనుక్కుని, ఈ షోను నిర్వహిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్స్ గా యశ్వంత్ మాస్టర్, మోనాల్ గజ్జర్, శ్రీముఖి వ్యవహరిస్తున్న ఈ షోకు శేఖర్ మాస్టర్, రమ్యకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటెస్టెంట్ అసీఫ్ చేసిన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన షో నిర్వాహకుడు ఓంకార్ అతని తండ్రిని వేదిక మీదకు పిలిపించాడు. ‘ప్రతి పండగకు స్నేహితులను తాను హగ్ చేసుకుని శుభాకాంక్షలు చెబుతానని, కానీ తండ్రిని హగ్ చేసుకోనే ఛాన్స్ తనకు దక్కలేద’ని అసీఫ్ కన్నీటితో చెప్పాడు.
దాంతో వెంటనే అసీఫ్ తండ్రి… కొడుకుని గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ తండ్రీ కొడుకులను అలా చూసి శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయిపోయారు. తండ్రిని అలా కౌగలించుకునే ఛాన్స్ తనకు జీవితంలో దక్కలేదని చెప్పారు. దాంతో ఓంకార్ శేఖర్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి ఓదార్చి, తనకూ తండ్రి లేడని చెబుతూ హగ్ ఇచ్చారు. ఈ సమయంలో మోనాల్ గజ్జర్ సైతం కన్నీటి పర్యంతమైపోయింది. మొత్తానికి డాన్స్ ఐకాన్ షో వినోదంతో పాటు హృదయాలను కదిలించే సన్నివేశాలతో రక్తి కడుతోంది.