టాలీవుడ్‌లో సరికొత్త క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. వినోదాత్మక సినిమాల స్పెషలిస్ట్, దర్శకుడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నూతన సినిమాకు సంబంధించిన కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు నేడు జూబ్లీహిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.
‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘కింగ్’, ‘దూకుడు’, ‘బాద్‌షా’ వంటి ఇండస్ట్రీ హిట్లతో తెలుగు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన శ్రీను వైట్ల.. చాలా గ్యాప్ తర్వాత తన మార్క్ పక్కా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. శర్వానంద్ టైమింగ్‌కు, శ్రీను వైట్ల మార్క్ వింటేజ్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ లీకైంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి రేసులో నిలబెట్టాలనే పక్కా లక్ష్యంతో చిత్ర యూనిట్ ఇప్పుడే భారీ ప్లాన్ సిద్ధం చేసింది. షూటింగ్ షెడ్యూల్స్ అన్నింటినీ చకచకా పూర్తి చేసి, వచ్చే సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోపై మెగా అంచనాలు నెలకొన్నాయి.

