Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..

Cab

Cab

Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో ఘోరం వెలుగుచూసింది. ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ. 60 వేల నగదుతో పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన మహిళ(35) వ్యక్తిగత పనిపై రూ.60 వేలు బ్యాగ్‌లో పెట్టుకుని.. ఆదివారం సాయంత్రం క్యాబ్‌ ఎక్కింది. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద డ్రైవర్ హఠాత్తుగా రూట్ మార్చాడు. వాహనాన్ని కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. తీవ్ర భయాందోళనకు గురైన సదరు మహిళ వెంటనే ధైర్యం చేసి కారులోంచి కిందకు దిగి గట్టిగా కేకలు వేసింది. దీంతో డ్రైవర్ బాధితురాలి వద్ద ఉన్న రూ. 60 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఈ తరహా దిగ్భ్రాంతికర ఘటనల నేపథ్యంలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు పలు జాగ్రత్తలు పాటించడం అవసరం. క్యాబ్ ఎక్కే ముందే వాహనం నంబర్, డ్రైవర్ వివరాలను కుటుంబ సభ్యులకు లేదా మిత్రులకు షేర్ చేయాలి. ప్రయాణ సమయంలో జీపీఎస్ (GPS) లొకేషన్ ఆన్‌లో ఉంచుకోవాలి. డ్రైవర్ నిర్ణీత మార్గాన్ని కాదని వేరే రూట్‌లోకి వెళ్తుంటే వెంటనే ప్రశ్నించాలి. ఏదైనా విపత్కర పరిస్థితి లేదా ప్రమాదం అనిపిస్తే వెంటనే భయపడకుండా ‘డయల్ 112’కు సమాచారం అందించాలి. తెలంగాణ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన ‘హాక్ ఐ’ (HAWK-EYE) యాప్‌లోని అత్యవసర బటన్‌ను ఉపయోగించడం వల్ల పోలీసులకు తక్షణమే సమాచారం చేరుతుంది. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు అపరిచిత వాహనాలు, ప్రైవేటు క్యాబ్‌ల పట్ల మహిళలు ఎల్లప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి.