ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఔట్ వివాదానికి దారితీసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సంజు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ విషయంలో ఫీల్డ్ అంపైర్.. టీవీ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్షించి ఔట్ ఇచ్చాడు. వికెట్ కీపర్ చేతివేళ్ల మీదే బంతి పడినట్లు స్పష్టంగా రిప్లైలో తెలుస్తోంది. అయినా కూడా పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు వివాదం చేస్తున్నారు.
టీవీ అంపైర్‌పై పాకిస్థాన్ టీమ్ మేనేజర్ ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ.. ‘ఆ అంపైర్ ఐపీఎల్‌లో కూడా అంపైరింగ్ చేయాలి కదా?. అందుకే టీమిండియాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడు’ అని అన్నాడు. అఫ్రిది వ్యాఖ్యలపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. వీడియోలో స్పష్టంగా తెలుస్తోన్నా కూడా అఫ్రిది అలా మాట్లాడడం సరికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు అంటూ భారత ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఈ వివాదంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కేవలం రెండు కోణాల్లోనే బంతిని పరిశీలించి ఔట్‌గా ప్రకటించారని అసహనం వ్యక్తం చేశాడు. ఫకర్ జమాన్ అప్పటికే మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో ఉన్నాడని, గ్రేట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మొదటి ఓవర్‌లో బాగా ఎదుర్కొన్నాడని ప్రశంసించాడు. ఫకర్ జమాన్ వికెట్ భారత జట్టుకు చాలా కీలకమైంది అని యూసఫ్ చెప్పుకొచ్చాడు.
