బీహార్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సాధించారు. దీంతో ఈ ‘సెవెన్ సిస్టర్స్’ పేర్లతో పాటు వారిని ఈ స్థాయికి తీసుకువచ్చిన వారి తండ్రి పేరు కూడా ప్రస్తుతం మార్మోగిపోతుంది. వీరంతా బీహార్ లోని ఛప్రా జిల్లా వాసులు.. అయితే, జిల్లాకు చెందిన కమల్ సింగ్ కు 8 మంది కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే, ఇందులో అనారోగ్య కారణంతో ఒక కుమార్తె చిన్నప్పుడే చనిపోయింది.
ఇక, కమల్ సింగ్ కు మొత్తం ఆడపిల్లలే పుడుతూ ఉండడంతో ఆయన్ను ఇరుగుపొరుగువారు మానసిక వేదనకు గురి చేశారు. ఒకానొక సమయంలో సొంత గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చప్రాలోని ఎక్మాకు వచ్చి అతడు స్థిరపడ్డాడు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూనే తన కూమార్తెల సహాయంతో ఇంటి దగ్గర ఓ చిన్న పిండి గిర్నీని నడిపేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను కమల్ సింగ్ చదివించారు.
Read Also: Hyderabad: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
అయితే, ప్రస్తుతం ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు బీహార్ పోలీసు శాఖతో పాటు వివిధ కేంద్ర సాయుధ బలగాలకు పోలీసులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఒకరు 2006లోనే సశస్త్ర సీమా బల్- ఎస్ఎస్బీలో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. దీంతో మిగతా వారందరికీ పోలీసు శాఖలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, వీరిలో రెండో సోదరి రాణి పెళ్లి తర్వాత 2009లో బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యారు. అలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా మరో ఐదుగురు కూడా ఎక్సైజ్ శాఖ, సీఆర్పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ దళాలకు పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. అయితే ఉద్యోగానికి ఎంపిక అయ్యేందుకు ముందు కావాల్సిన నైపుణ్యాలు, మెలకువలను వీరందరూ తమ అక్కల ద్వారా నేర్చుకున్నట్లు చెప్పారు.
Read Also: Chandrababu Election Campaign: నేటి నుండి చంద్రబాబు సుడిగాలి పర్యటనలు..
ఇక, ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న తమ తండ్రికి ఆసరాగా ఉండేందుకు కుమార్తెలందరూ కలిసి ఛప్రాలోని ఎక్మా బజార్‌లో ఓ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించి బహుమతిగా ఇచ్చారు. దీంతో వారికి నెలకు 18 వేల నుంచి 20 వేల రూపాయల అద్దెను పొందుతున్నట్లు కమల్ సింగ్ వెల్లడించారు. ఇక, ఆర్థికంగా ప్రస్తుతం తనకేమీ ఇబ్బందుల్లేవని వెల్లడించారు. అయితే, ఈ ‘సెవెన్ సిస్టర్స్’కు వన్ అండ్ ఓన్లీ బ్రదర్ కూడా ఉన్నాడు.